Australian Open Mens Final 2024 : వరుసగా రెండు సెట్లలో ఓటమి, సీనియర్ ప్లేయర్ దూకుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆటగాడైనా సరే మ్యాచ్‌ను అప్పగించేసి, ఓటమిని అంగీకరించి వచ్చేస్తారు. కానీ అతడు అలా చేయలేదు. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుత పోరాటం చేశాడు. ఫలితంగా తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ను సాధించాడు. అతడు ఇటలీ టెన్నిస్ ప్లేయర్ జనిక్ సినర్ (Jannik Sinner Australian Open). ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడు ఈ 22 ఏళ్ల కుర్రాడు.
Jannik Sinner Medvedev Highlights : తుది పోరులో మద్వదేవ్(రష్యా)పై సినర్ విజయాన్ని అందుకున్నాడు. 3-6, 3-6తో తొలి రెండు సెట్లు కోల్పోయిన సినర్ ఆ తర్వాత 6-4, 6-4, 6-3తో చివరి మూడు సెట్లు గెలిచి టైటిల్ గెలుచుకున్నాడు. ఆరంభంలో ఒత్తిడికి గురై వెనుకపడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఆరంభంలో పెద్దగా పోరాడకుండానే తలొగ్గిన సినర్‌ను తక్కువగా అంచనా వేయడం వల్లే మెద్వెదెవ్ ఓటమి పాలయ్యాడు. దాదాపు 3 గంటల 45 నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్. ఇక తాజా ఓటమితో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ దక్కించుకోవాలన్న మూడో సీడ్ మెద్వెదెవ్ కల మళ్లీ కలగానే ఉండిపోయింది. 2021, 2022లలో కూడా మెద్వెదెవ్ ఫైనల్ వరకు చేరి ఓటమి పాలయ్యాడు.
ఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సినర్ నిలిచాడు. 2014 తర్వాత జొకోవిచ్, ఫెదరర్, నాదల్ కాకుండా ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ గెలిచిన తొలి ప్లేయర్ ఇతడే కావడం మరో విశేషం. 2014లో స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాన్ వావ్రింకా టోర్నీ విజేతగా నిలిచాడు.