6 Balls 6 Sixes:నేపాల్ యంగ్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ప్రపంచ రికార్డ్ సాధించాడు. 2024 ఆసియా ప్రీమియర్ కప్ టోర్నీలో భాగంగా ఖతార్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన మూడో క్రికెటర్‌గా దీపేంద్ర రికార్డు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19 ఓవర్లకు 174-7తో నిలిచింది.
అప్పటికి క్రీజులో ఉన్న దీపేంద్ర స్కోర్ 28 పరుగులు (15 బంతుల్లో). ఇక ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో దీపేంద్ర వరుసగా 6 సిక్స్‌లు నమోదు చేసి ఔరా అనిపించాడు. దీంతో నేపాల్ 210 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక టీ20ల్లో టీమ్ఇండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ ప్లేయర్ కీరణ్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా దీపేంద్ర నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌లో నేపాల్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనలో ఖతార్ నిర్ణీత 20 ఓవర్లలో 178-9కే పరిమితమైంది. దీంతో నేపాల్ 32 పరుగుల తేడాతో మ్యాచ్‌లో గెలుపొందింది. మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టిన దీపేంద్ర సింగ్‌కే 'మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.