2024 Womens T20 World Cup :2024 మహిళల వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో టీ20 సమరం ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో 10 జట్లు తలపడుతున్నాయి. ఎప్పటిలాగే భారత మహిళల జట్టు కూడా ఈసారి బోలెడన్ని ఆశలతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే రెండుసార్లు వన్డే, ఓసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినప్పటికీ టీమ్ఇండియా టైటిల్ దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైన వరల్డ్ ఛాంపియన్స్‌గా అవతరించాలని హర్మన్ సేన గట్టి పట్టుదలతో ఉంది.
ఇక 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. గ్రూప్ Aలో టీమ్ఇండియాతో పాటు బలమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. మరోవైపు గ్రూప్ Bలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి. మొత్తం 18 రోజుల్లో టోర్నీలో 23 మ్యాచ్‌లు జరగనున్నాయి.
బంగ్లాదేశ్ - స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. తర్వాత పాకిస్థాన్ - శ్రీలంక తలపడనున్నాయి. ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 4న భారత్ తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టనుంది. మరి ఈ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి? లైవ్ స్ట్రీమింగ్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుందంటే?
బ్రాడ్కాస్ట్ :ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి సంబంధించి బ్రాడ్కాస్ట్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. భారత్‌లో మహిళల వరల్డ్‌కప్ మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ :ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ + హాట్‌స్టార్ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. మ్యాచ్‌లన్నీ డిస్నీ + హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.