2024 Ranji Trophy Winner:2024 రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టుపై ముంబయి ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 169 పరుగుల తేడాతో నెగ్గిన ముంబయి 42వ సారి రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 368 పరుగులకే కుప్పకూలింది. కరుణ్ నాయర్ (74 పరుగులు), అక్షయ్ వాడ్కర్ (102 పరుగులు), హర్ష్ దూబే (65 పరుగులు) మాత్రమే రాణించారు. ముంబయి బౌలర్లలో తనుశ్ కొటియన్ 4, ముషీర్ ఖాన్ 2, తుషార్ దేశ్‌పాండే 2 షమ్స్ ములాని 1 వికెట్ దక్కించుకున్నారు. కాగా, గత ఎనిమిదేళ్లలో ముంబయి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలివడం ఇదే తొలిసారి. చివరిసారిగా ముంబయి 2015- 16లో టైటిల్ నెగ్గింది.
భారీ లక్ష్య ఛేదనలో విదర్భ ఒక దశలో 352-5తో గెలుపు దిశగా సాగుతోంది. అప్పటికి క్రీజులో అక్షయ్ వార్కర్ (102), వార్ష్ దూబే (65) ఉన్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ముంబయిని ఆందోళనలో నెట్టారు. కానీ, తనష్ కొటియన్ 353 పరుగుల వద్ద సెంచరీ హీరో అక్షయ్‌ను పెవిలియన్ చేర్చి, ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా దూబే, ఆదిత్య సార్వతే (3 పరుగులు), యశ్ ఠాకూర్ (6 పరుగులు), ఉమేశ్ యాదవ్ (6 పరుగులు) ఔట్ అయ్యారు. కాగా, విదర్భ 15 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.
అంతకుముందు ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్ (136 పరుగులు), కెప్టెన్ అజింక్యా రహానే (73 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (95 పరుగులు), షమ్స్ ములాని (50 పరుగులు) రాణించడం వల్ల జట్టుకు భారీ స్కోర్ దక్కింది. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే 5, యశ్ ఠాకూర్ 3, ఆదిత్య ఠాక్రే, అమన్ మోఖడే తలో వికెట్ దక్కించుకున్నారు.