Kanuma Festival 2025 : నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాం. అయితే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని, కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకూడదని అంటారు. అసలు ఈ నియమం రావడం వెనుక కారణమేమై ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
పెద్ద పండుగ
సంక్రాంతి పండుగను తెలుగు వారు పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. సంక్రాంతి సందర్భంగా పల్లెలు రంగురంగుల రంగ వల్లికలతో, కొత్త అల్లుళ్లతో, ఘుమఘుమలాడే పిండి వంటలతో, భోగి మంటలతో, హరిదాసుల కీర్తనలతో, గంగిరెద్దుల నాద స్వరాలతో సందడిగా ఉంటుంది. ఇలా సందడిగా గడిపిన తర్వాత పల్లె విడిచి పట్నం పోవడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఉద్యోగ బాధ్యతలు, ఇతరత్రా వ్యవహారాల వల్ల నగరాలకు చేరక తప్పదు. అయితే మన తెలుగు రాష్ట్రాలలో కనుమ నాడు ప్రయాణం చేయకూడదని అంటారు. కనీసం ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు.
కనుమ రోజు కాకులు కూడా కదలవా?
ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని అంటారు. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు.
మూగజీవాలను పూజించే సంస్కృతి
పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద. ఏడాది మొత్తం రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సంప్రదాయం. కనుమ రోజు ఉదయాన్నే పశువులను ఊళ్లోని చెరువుల వద్దకు తీసుకెళ్లి వాటిని శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. పసుపు కుంకుమలతో పశువులను అలంకరిస్తారు. వాటి కాళ్లకు చిరు మువ్వల పట్టీలు కట్టి సంబరపడిపోతాడు. మెడలో చిరుగంటలు కడతారు. అనంతరం పశువులకు హారతి ఇచ్చి, మంచి ఆహారాన్ని అందిస్తారు. కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగు వారికే సొంతం.