తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? అసలు విషయమేమిటంటే? - EKADASHI FASTING SIGNIFICANCE

ఏకాదశి ఉపవాసం వెనుక ఏదైనా గూఢార్థం ఉందా? అసలు విషయమిదే!

Ekadashi Fasting Significance
Ekadashi Fasting Significance (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 24 hours ago

Why We Do Fasting On Ekadashi :ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశికి ప్రత్యేకత ఉపవాసం వల్లనే వస్తుంది. శాస్త్రం ప్రకారం ఏకాదశి రోజు భోజనం చేయడం నిషిద్ధం. ప్రతి ఒక్కరూ ఏకాదశికి ఉపవాసం ఉండాలని అంటారు కానీ అసలు ఏకాదశికి ఉపవాసం ఎందుకు చేయాలి? ఏకాదశి ఉపవాసం వెనుక ఏదైనా గూఢార్థం ఉందా? ఈ అంశాలను గురించి ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.

ఆరోగ్యరీత్యా నెలకు రెండు సార్లు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఏకాదశి ఉపవాసం వెనుక ఓ ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఉంది.
'ముర' అనే రాక్షసుని కథ
భవిష్య పురాణం ప్రకారం సత్యయుగంలో 'ముర' అనే రాక్షసుడు ఉండేవాడు. ముర బ్రహ్మదేవుని గురించి గొప్ప తపస్సు చేసి అనేక శక్తులు పొందుతాడు. వర ప్రభావంతో అత్యంత శక్తివంతుడైన ముర అమాయక ప్రజలను, విష్ణు భక్తులను, ఋషులను, దేవతలను హింసించసాగాడు.

విష్ణువును ఆశ్రయించిన ఋషులు, దేవతలు
ముర పెట్టే బాధలు భరించలేక ఋషులు, దేవతలు శ్రీహరిని ప్రార్ధిస్తారు. శ్రీహరి మురతో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో శ్రీహరి తీవ్రంగా అలిసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ఓ గుహలో విశ్రమిస్తాడు.

విష్ణువును సంహరించబోయిన ముర
విష్ణువు విశ్రాంతి తీసుకునే సమయంలో ఇదే అదనుగా భావించి ముర శ్రీహరిని సంహరించబోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి మహా తేజస్సుతో కూడిన యోగమాయ అనే కన్య ఉద్భవించి ముర రాక్షసుని సంహరిస్తుంది.

ఏకాదశి ఇలా వచ్చింది!
శ్రీహరి శరీరం నుంచి ఉద్భవించిన కన్య పక్షంలో 11 వ రోజు ఉద్భవించింది కాబట్టి ఆమెకు శ్రీమహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేసి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వారు సకల పాపాల నుంచి విముక్తి పొంది అంత్యమున విష్ణు సాయుజ్యాన్ని పొందుతారని శ్రీహరి వరమిచ్చాడు. ఆనాటి నుంచి ప్రజలు ఏకాదశి ఉపవాసం ద్వారా తమ పాపాలను తొలగించుకొని విముక్తులవుతున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

శ్రీమహావిష్ణువును ఆశ్రయించిన పాప పురుషుడు
ఇలా మానవులు ఏకాదశి ఉపవాసం చేసి పాపాలను తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు ఆవేదనతో శ్రీహరిని ఆశ్రయిస్తాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు పాప పురుషునితో "ఏకాదశి రాత్రి చంద్రోదయ వేళ జరిగే మూడు గ్రహాల కలయిక సమయంలో ఎవరైతే భోజనము చేస్తారో నీవు వారిని ఆశ్రయించు! అని చెబుతూ ఇంకను ఇలా చెప్పాడు "ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఏకాదశి రాత్రి ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజు అన్నం, పప్పు ధాన్యాలు తినకుండా, చంద్రోదయానికి ముందు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకొని, హరినామ స్మరణతో ఉపవాసాన్ని కొనసాగించే వారికి ఏకాదశివ్రత పుణ్యఫలం పూర్తిగా దక్కుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న పౌరాణిక గాధ ఇదే! ఏకాదశి వ్రతం చేసేవారు ఈ కథను తప్పకుండా తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details