Vastu Tips For Pooja Room : మనం నివసించే గృహం స్వర్గసీమ కావాలంటే వాస్తు శాస్త్రంలో చెప్పిన కొన్ని సూత్రాలను మనం తప్పకుండా పాటించాల్సిందే! మానవ జీవితానికి వాస్తు శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏవో ఒక సమస్యలు, అప్పులు, ఆర్థిక పురోగతి లేకపోవడం, అనారోగ్య బాధలు వీటన్నింటికి వాస్తు దోషాలు కారణం. వాస్తు దోషాలకు పరిహారాలు తెలుసుకొని ఇంటిని వాస్తురీత్యా అమర్చుకుంటే గృహమే స్వర్గసీమ అవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి అలాంటి స్వర్గం కోసం మనం ఏమి చేయాలో చూద్దాం..
పూజా మందిరం హృదయ స్థానం
ఏ ఇంటికైనా పూజా మందిరం హృదయ స్థానం వంటిది. ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. పూజా మందిరంలో మనం చేసే పూజలే మనకు ఆయుష్షును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అందుకే ప్రతి ఇంట్లో చిన్నదైనా సరే పూజా మందిరం ఉండాల్సిందే అంటుంది వాస్తు శాస్త్రం. పూజా మందిరంలో వాళ్లు వీళ్లు ఇచ్చారు కదా అని దొరికిన ఫొటోలన్నీ పెట్టి గందరగోళం చేసేయకూడదు. ఇంట్లో అడ్డాలుంటే మనకెలా ఊపిరాడదో దేవునికి కూడా అంతే! అసలే చిన్న గది అందులో అక్కర్లేనివి అన్నీ పెట్టేస్తే దేవునికి ఎలా ఊపిరాడుతుంది చెప్పండీ!
ఇంటి ఆనవాయితీ ప్రధానం
కొంత మందికి వారి ఇంటి పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవుని సింహాసనం ఆనవాయితీ ఉంటుంది. మరికొంతమంది సాధారణంగా పీట మీద దేవుని విగ్రహాలను కానీ, పటాలను కానీ ఉంచుతారు.
ఇలవేల్పు కులదైవం
ప్రతి వారికి వారి ఇంటి ఇలవేల్పు ఉంటారు. ఆ సంప్రదాయం ప్రకారం వారి ఇలవేల్పులను ముందుగా పూజా మందిరంలో సింహాసనం లో కానీ, పీట మీద కానీ అమర్చుకోవాలి. తరువాతే మిగిలిన దేవీదేవతల విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
నిత్య దీపారాధనతోనే ఇంటి క్షేమం
పూజామందిరంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తప్పకుండా దీపారాధన చేసి పూజాదికాలు చేయాలి. ఇది ఇంటికి ఎంతో క్షేమం.
ఎవరు పూజ చేస్తే ఇంటికి శ్రేయస్కరం?
ఇంటికి ప్రధమ స్థానం ఇంటి యజమానిదే అంటుంది వాస్తు శాస్త్రం. అందుకే ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని పూజాధికాలు చేస్తాడో ఆ ఇంట్లో వారందరూ సుఖసంతోషాలతో ఉంటారు. సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. ఆ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటుంది.