House Cleaning Tips in Telugu: సంక్రాంతి పండగ సమీపిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది మహిళలు ఇంటిని శుభ్రం చేసేందుకు సన్నద్ధమవుతుంటారు. బట్టల నుంచి వస్తువుల వరకు అన్నింటిని క్లీన్ చేస్తుంటారు. అయితే క్లీనింగ్ సమయంలో చాలా మంది హడావుడి పడిపోతుంటారు. ఒక్కరోజులోనే అయిపోవాలనే కారణంతో పైపైనే క్లీన్ చేస్తుంటారు. ఫలితంగా కొన్ని రోజులకే ఇళ్లు మొత్తం దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. కాబట్టి శుభ్రత విషయంలో హడావుడి పడకుండా ఈ టిప్స్ పాటిస్తే ఇళ్లు తళుక్కున మెరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
లివింగ్ రూమ్: ఒక్కరోజులోనే ఇల్లంతా పూర్తి చేసేయాలన్న తొందర వద్దని నిపుణులు అంటున్నారు. అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి, ప్లాన్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. ఇంటిని శుభ్రం చేసే ముందు డోర్‌మ్యాట్‌లు, కర్టెన్లు తీసేయమంటున్నారు. తర్వాత ప్రతి గదిలోనూ వాడనివీ, పడేయాల్సిన వాటిని తీసేస్తే.. పని తేలిగ్గా పూర్తవుతుంది. కాబట్టి, లివింగ్ రూమ్ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయమని చెబుతున్నారు.
బెడ్రూమ్: లివింగ్ రూమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత బాత్రూమ్స్లో ఉన్న షెల్ఫ్‌లు సర్దమని చెబుతున్నారు. ఆ తర్వాత ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఉపయోగించే సహజ లేదా మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులను వేసి అలా కొద్దిసేపు ఉంచమంటున్నారు. తర్వాత బెడ్రూమ్ క్లీనింగ్ చేయమంటున్నారు. బెడ్రూమ్లోని ఒక్కో అరనీ శుభ్రం చేసుకుంటూ.. మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత మార్చాలనుకున్నవి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మార్చేస్తే సరిపోతుందని అంటున్నారు. అనవసరంగా ఉన్నవీ, వాడని వాటిని ఓ సంచి అట్టపెట్టెలో పెట్టి.. ఎవరికైనా ఇచ్చేస్తే మంచిదంటున్నారు. అలా కాకుండా పక్కన పెట్టేసుకుంటూ వెళితే వాటిని తీయడం మరో పనవుతుందని చెబుతున్నారు.
కిచెన్: వంటగదిని రోజూ శుభ్రం చేయడం అలవాటే. ఎంత శుభ్రం చేసినా నూనె, జిడ్డు మరకలు పడుతూనే ఉంటాయి. కాబట్టి, దీనిని డీప్ క్లీనింగ్ చేయాలి. అందుకోసం ఎలక్ట్రానిక్ పరికరాలను ముందు శుభ్రం చేయాలి. ఆపై అరలు క్లీన్ చేయాలి. పూజలకు, పెద్ద వంటలకు అవసరమయ్యే పాత్రలను కడిగి పెట్టుకోవాలి. మిగతా వాటిని పాత వస్త్రంతో తుడవాలి. అలమరాలన్నీ పూర్తయ్యాక స్టవ్, బండ, కిచెన్ గోడలు, సింక్‌ను క్లీన్ చేయాలంటున్నారు. వీటికోసం మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ లేదా ఇంట్లో లభించే సహజ క్లీనర్స్ అయిన నిమ్మకాయ, వంటసోడా, వెనిగర్ వంటి ఉపయోగించమంటున్నారు. ఇదంతా అయ్యాక బాత్రూమ్‌లని కడిగేస్తే మరకలు వదులి శుభ్రంగా ఉంటుందని అంటున్నారు.
ఈ జాగ్రత్తలు కూడా:
- మైక్రోఫైబర్ వస్త్రాలను ఎంచుకుంటే దులిపేటప్పుడు దుమ్ము ఒళ్లంతా పడటం, అలర్జీల బాధ ఉండదని.. పదే పదే నేలను తుడవాల్సిన పనీ ఉండదంటున్నారు.
- దుమ్ము దులిపేటప్పుడు, క్లీనింగ్ ఉత్పత్తుల్ని వాడే సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఆ గాలి ఇంట్లోనే ఉండిపోయి.. ఆ ఘాటైన వాసనలు మన ఆరోగ్యానికి చేటు చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
- క్లీన్ చేసిన ప్రతిసారీ క్లాత్స్/స్పాంజ్‌లు ఉతికి పొడిగా ఆరబెట్టాలని చెబుతున్నారు. వీటిని సరిగ్గా క్లీన్ చేయకపోయినా, పూర్తిగా ఆరబెట్టకపోయినా వాటిపై బ్యాక్టీరియా వృద్ధి చెంది.. వాటిని మళ్లీ వాడినప్పుడు ఇంట్లోని వస్తువులపై చేరే అవకాశం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
సూపర్ టిప్స్ : అద్దాలు, గాజు వస్తువులపై మరకలు ఎంతకీ పోవట్లేదా? - చిటికెలో కొత్తవాటిలా మెరిపించండి!
పండక్కి ఇల్లు క్లీన్ చేస్తున్నారా? - ఈ తప్పులు చేస్తే ఎంత శుభ్రం చేసినా మురికిగానే!