Vasanta Navratri 2024: చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం మొదలవుతుంది. అలాగే ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు ఆగమనం కూడా ఈ నాటి నుంచే మొదలవుతుంది. ఈ వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు గల తొమ్మిది రోజులను వసంత నవరాత్రులని అంటారు. శిశిరంలో ఆకులు రాల్చి మోడువారిన చెట్లన్నీ వసంతం రాకతో పచ్చగా చిగుళ్ళు వేసి ప్రకృతి అంతా పచ్చగా చూడ ముచ్చటగా ఉంటుంది. మోడువారిన చెట్లకు వేసిన లేత చిగుర్లు తినడానికి వచ్చే కోయిల కూ కూ నాదాలతో ప్రకృతి మాత పరవశించి పోతుంది.
పరమాత్మ మెచ్చే వసంతం
వసంత శోభకు మానవులు, పశుపక్ష్యాదులు మాత్రమే కాదు భగవంతుడు కూడా పరవశిస్తాడంట. అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వసంత ఋతువు లోనే పరిపూర్ణ మానవునిగా ఈ భూమిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. ఆ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఎలాగైతే మోడువారిన చెట్లు వసంతం రాకతో నూతన శోభతో కళకళలాడుతాయో, అలాగే అప్పటివరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషం చెందాయంట. అలా శ్రీరాముడు పుడుతూనే సకల జీవకోటికి ఆనందం కలిగించాడు.
తొమ్మిది రాత్రులే ఎందుకు
సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు పేరిట జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వసంత నవరాత్రులు తొమ్మిది రోజులే ఎందుకు జరుపుకోవాలి? ఎనిమిది లేదా పది రోజులు జరుపుకోవచ్చు కదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ 'నవ' అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. తొమ్మిది అని ఒక అర్థం అయితే, నవ అంటే నూతన అని మరొక అర్థం కూడా ఉంది. అప్పటివరకు రాక్షస పీడతో శోకమయంగా ఉన్న లోకాలు శ్రీరాముని జననంతో కొత్త సంతోషాలను అందించే నవరాత్రులుగా జరుపుకోవడం ఆచారంగా మారింది.
నవవిధ భక్తి మార్గమే ముక్తి మార్గం!
మనకు వేదాలలో భగవంతుని సేవించడానికి సూచించిన భక్తి మార్గాలు తొమ్మిది. అవేమిటంటే
- శ్రవణం
- కీర్తనం
- స్మరణం
- పాదసేవనం
- అర్చనం
- వందనం
- దాస్యం
- సఖ్యం
- ఆత్మనివేదనం