తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆగస్టు 16నే వరలక్ష్మీ వ్రతం - మొదటి నుంచి చివరి దాకా - ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? - Varalaxmi Vratam Pooja Vidhanam - VARALAXMI VRATAM POOJA VIDHANAM

Varalakshmi Vratam : శ్రావణమాసంలో మహిళలందరూ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 16వ తేదీన జరుపుకోనున్నారు. మరి, ఈ రోజున అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలో మీకు తెలుసా?

Varalakshmi Vratam
Varalakshmi Vratam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 12:30 PM IST

Varalakshmi Vratam Pooja Vidhanam Procedure:శ్రావణ మాసం.. పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో ఇదీ ఒకటి. ఈ మాసంలో మహిళలందరూ వ్రతాలు, నోములు, పూజలు చేసుకుంటుంటారు. ఇక ఎక్కువ మంది మహిళలు చేసుకునే వ్రతం వరలక్ష్మీ వ్రతం. వరాల తల్లి వరలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళా తమకు తోచిన విధంగా పూజ చేసుకుంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. మరి ఈ రోజున వ్రతం ఎలా జరుపుకోవాలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నండూరి శ్రీనివాస్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

వరలక్ష్మీ వ్రతం చేసే విధానం:

  • వ్రతానికి కావాల్సిన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
  • వ్రతం రోజున సూర్యోదయానికి ముందు గానే లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుని రంగ వల్లులు వేసుకోవాలి.
  • ఆ తర్వాత తలంటు స్నానం చేసి ఇంటి గుమ్మాలకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్యం చేసుకునే విధంగా పూజ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతం కోసం మండపం సిద్ధం చేసుకోవాలి. చాలా మంది పూజ గదిలోనే వ్రతం చేసుకుంటారు. పూజా గదిలో స్థలం లేని వారు ఇంట్లో తూర్పు వైపు పీఠం పెట్టుకోవాలి. అందుకోసం మీరు ఎక్కడైతే పీఠం పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • ఆ తర్వాత బియ్యప్పిండితో ముగ్గులు వేసి దానిపైన పేపర్​ లేదా క్లాత్​ పరుచుకోవాలి.
  • ఆ తర్వాత చెక్కపీటను తీసుకుని శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకుని కంకణం కట్టుకోవాలి.
  • పూజించిన పీటను ముగ్గు మధ్యలో పెట్టి దాని మీద బియ్యం పోసుకోవాలి.
  • ఇప్పుడు కలశం ప్రతిష్ఠించాలి. అందుకోసం రాగి లేదా వెండి కలశం తీసుకుని శుభ్రం చేసుకుని అందులో నీరు పోసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, రూపాయి నాణెం, పూలు వేసుకోవాలి. అమ్మవారి ప్రతిరూపంగా కొబ్బరికాయను కలశం పై ఉంచి పసుపు, కుంకుమ, గంధం పూలతో కలశాన్ని పూజించుకోవాలి. కలశారాధన అయిపోయిన తర్వాత మండపాన్ని పూలతో అలకరించుకోవాలి.
  • ఆ తర్వాత తోరాలను సిద్ధం చేసుకోవాలి. తొమ్మిది పోగులు, తొమ్మిది ముడులతో తోరాలను చేసుకోవాలి.
  • ఆ తర్వాత గణపతి పూజ చేసుకోవాలి. తమలపాకులో పసుపు గణపతిని చేసుకుని గంధం, కుంకుమ, పూలతో అలకరించుకుని ధూప, దీప, నైవేద్యం, తాంబూలాలను సమర్పించాలి.
  • గణపతి పూజ తర్వాత వరలక్ష్మీ వ్రతం మొదలు పెట్టాలి. తమలపాకులో పసుపుతో గౌరీదేవిని చేసుకుని షోడశోపచార పూజ చేసుకోవాలి. అందులో ముందుగా ధ్యానం చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం -ఆభరణానికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అంగపూజ చేసుకోవాలి. అనంతరం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారికి పూలు సమర్పించాలి.
  • ఆ తర్వాత అమ్మవారికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యాలు ఎన్ని రకాలు వీలుంటే అన్ని చేసుకోవచ్చు. అయితే లక్ష్మీదేవికి ఆవుపాలతో చేసిన బియ్యపు పరమాన్నం అంటే ఇష్టం. పులిహార కూడా ప్రీతికరమే. కాబట్టి ఎవరి వీలును బట్టి వారు చేసుకోవచ్చు.
  • నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అమ్మవారికి అందించాల్సిన తాంబూలంలో చీర, రవిక, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, నానబెట్టిన శనగలు, పండ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి.

వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి అద్వితీయ ముహూర్తం ఇదే - మీకు తెలుసా?

తోరగ్రంథి పూజ: ఆ తర్వాత తోరగ్రంథి పూజ చేయాలి. ముందుగానే సిద్ధం చేసుకున్న తోరాలను అమ్మ వారి వద్ద ఉంచి కుంకుమతో పూజ చేయాలి.

  1. కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి,
  2. రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి,
  3. లోకమాత్రేనమః తృతీయ గ్రంథిం పూజయామి,
  4. విశవజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి,
  5. మహాలక్ష్మ్యైనమః పంచమ గ్రంథిం పూజయామి,
  6. క్షీరాబ్ది తనయామై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి,
  7. విశ్వసాక్షిణ్యె నమః సప్తమ గ్రంథిం పూజయామి,
  8. చంద్రసోదర్యైనమః అష్టమ గ్రంథిం పూజయామి,
  9. శ్రీ వరలక్ష్మీయై నమః నవమ గ్రంథిం పూజయామి

తర్వాత పూజించిన తోరాలలో ఒకటి అమ్మవారికిచ్చి, మరొకటి ముత్తైదువకి ఉంచి, వేరొకటి తను ధరించి వరలక్ష్మీ వ్రత కథ చెప్పుకోవాలి. అయితే తోరం కట్టుకునే ముందు ఈ కింది శ్లోకం చదవాలి.

భద్మామి దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం

పుత్ర పౌత్రాభి వృద్ధించ, ఆయుష్యం దేహిమే రమే

వాయనం:తర్వాత వచ్చిన ముత్తైదువులకు వాయనం అందించాలి. వాయనం ఇచ్చేముందు ఈ శ్లోకం చదవాలి.

  • ఇందిరా ప్రతి గృహ్నాతు ఇందిరా వైదదాతిచ
  • ఇందిరా తారికావాభ్యమ్​ ఇందిరాయై నమోనమః

NOTE : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వరలక్ష్మీ వ్రతం పూజ కోసం - మహిళలు ఏ రంగు చీర కట్టుకోవాలో మీకు తెలుసా?

వరలక్ష్మీ వ్రతం రోజున ఈ బొమ్మ పూజగదిలో ఉంటే - మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది!

ABOUT THE AUTHOR

...view details