తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వామన అవతారానికి ఉన్న ప్రత్యేకతే వేరు! విష్ణుమూర్తి అసలెందుకు స్వీకరించారు? - Vamana Jayanti 2024 - VAMANA JAYANTI 2024

Vamana Jayanti 2024 : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఐదోదైన వామన అవతారానికి ఉన్న ప్రత్యేకతే వేరు. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే వామనావతారంలో మూడే మూడు అడుగులతో లోకాన్నంతటిని జయించాడు. శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? ఆ అవతార ప్రయోజనమేమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Vamana Jayanti 2024
Vamana Jayanti 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2024, 4:34 AM IST

Vamana Jayanti 2024 :సెప్టెంబర్ 15 వ తేదీ భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు వామన జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతంలో శ్రీమహావిష్ణువు దశావతారాల గురించి ప్రస్తావన ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. దశాతరాల్లో ఐదవ అవతారమైన వామనుడి అవతారం లోక రక్షణ, దుష్ట శిక్షణ కోసమేనని విశ్వాసం. శ్రీహరి వామనుడి అవతారంలో భూలోకానికి వచ్చాడని, బలి చక్రవర్తిని కేవలం మూడు అడుగులతో మట్టుబెట్టాడని చెబుతారు. విష్ణుమూర్తిని వామనావతారంలో ఆరాధించడం ద్వారా, చేపట్టిన అన్ని పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారని విశ్వాసం.

వామనావతారం వెనుక ఉన్న పౌరాణిక గాధ

తొలి మానవావతారం
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి నాలుగు జంతు సంబంధమైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలు కాగా, నారాయణుడు తొలిసారిగా వామనావతారంలోనే మానవుడిగా అవతరించాడు.

దేవతలపై బలి దండయాత్ర
పురాణాల ప్రకారం ప్రహ్లాదుని మనుమడు బలి చక్రవర్తి గొప్ప త్యాగశీలి. విశ్వజిత్ యాగం చేసి అపరిమితమైన దానధర్మాలు చేసి శక్తిమంతుడైన బలి చక్రవర్తి స్వర్గాధిపతి ఇంద్రుడిపై యుద్ధం చేసి అతనిని ఓడించి ఇంద్ర లోకాన్నంతటికి ఆక్రమిస్తాడు. మహాబలశాలి బలిచక్రవర్తిని ఎదుర్కోలేక దేవతలంతా చెల్లాచెదురైపోతారు.

శ్రీహరిని శరణు వేడిన దేవతలు
ఆ సమయంలో దేవతలంతా శ్రీహరి వద్దకు వెళ్లి శరణు వేడుకొంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను అదితి అనే ఋషి పత్ని గర్భంలో జన్మిస్తానని చెప్పి, భాద్రపద మాసంలో శుక్ల పక్షం శుద్ధ ద్వాదశి నాడు వామనుడిగా జన్మిస్తాడు. ఆ రోజు నుంచి వామనుడు బలిచక్రవర్తిని మట్టుబెట్టే రోజు కోసం అందరూ ఎదురు చూడసాగారు.

బలి చక్రవర్తి యాగం- వామనుడి ఆగమనం
ఓ రోజు బలి చక్రవర్తి అశ్వమేథ యాగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతాడు. అదే అదనుగా భావించిన విష్ణుమూర్తి బ్రహ్మచారి బ్రాహ్మణుడిగా వామన రూపంలో యాగశాల వద్దకు చేరుకుంటాడు. బలి చక్రవర్తి వామనుడికి సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి ఏమి కావాలో కోరుకోమంటాడు.

మూడు అడుగులతో ముల్లోకాలు
బలి చక్రవర్తితో వామనుడు తనకు యాగం చేసుకునేందుకు మూడు అడుగులు కావాలని అడుగుతాడు. అందుకు బలి వెంటనే అంగీకరిస్తాడు. అయితే రాక్షస గురువైన శుక్రాచార్యుడు మాత్రం వామనుడి రూపంలో వచ్చింది సామాన్యుడు కాదని సాక్షాత్తూ ఆ శ్రీహరియేనని గ్రహించి బలి చక్రవర్తిని హెచ్చరిస్తాడు. అతనికి ఎలాంటి దానం ఇవ్వొద్దని చెబుతాడు. కానీ బలి చక్రవర్తి ఆడిన మాట తప్పని, తన సకల ఐశ్వర్యాలు, రాజ్యం చివరకు తన ప్రాణాలు పోయినా వామనుడికి దానమిచ్చి తీరుతానని చెబుతాడు.

బలికి శుక్రాచార్యుని శాపం
బలి ఎంత చెప్పిన వినకపోయేసరికి శుక్రాచార్యుడు బలిని రాజ్యభ్రష్టుడువి అవుతానని శపిస్తాడు.

కన్ను కోల్పోయిన శుక్రాచార్యుడు
వామనుడికి ఇచ్చిన మాట ప్రకారం బలి చక్రవర్తి వామనుడి పాదాలు కడిగి, ఆ నీటిని శిరస్సు మీద చల్లుకుంటాడు. వామనుడి కోరిక మేరకు మూడు అడుగులు దానమివ్వనున్నట్లు ప్రకటించి, కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తుంటాడు. ఆ కార్యాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. దీన్ని గ్రహించిన వామనుడి రూపంలో ఉన్న ఆ శ్రీహరి ఓ దర్భ పుల్లతో కలశం రంధ్రంలో పొడుస్తాడు. దీంతో శుక్రాచార్యుడు కన్నును కోల్పోతాడు.

యధావిధిగా దానం
బలి చక్రవర్తి యధావిధిగా మూడు అడుగులు దానం చేయగానే వామనుడు 'ఇంతింతై వటుడింతై' అన్నట్లు విశ్వరూపంతో మొదటి అడుగుతో భూమిని ఆక్రమించి, రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగు ఎక్కడ వేయాలని బలి చక్రవర్తిని అడుగగా అప్పుడు బలి తన ముందు వామనుడి రూపంలో ఉన్నది సాక్షాత్తూ ఆ శ్రీహరియేనని గ్రహించి మూడవ అడుగు తన శిరసుపై వేయమంటాడు.

బలిని పాతాళానికి అణిచివేసిన వామనుడు
అంతట ఆ శ్రీహరి మూడో అడుగు బలి నెత్తిపై వేసి పాతాళంలోకి నెట్టేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోషించిన మహావిష్ణువు ప్రతి ఏటా కొన్ని రోజులు భూమి మీదకు వచ్చిన తన రాజ్యాన్ని చూసుకునేలా వరమిస్తాడు. ఈ సందర్భంగానే ఓనం పండుగ జరుపుకుంటారు.

అహంకారాన్ని అణచడానికే వామనావతారం
మూడు అడుగులతో ముల్లోకాలను జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడనే పేరు వచ్చింది. వామనుడు మూడు అడుగులు మాత్రమే అడగడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే అవి సత్వరజోతమోగుణాలకు ప్రతీకలని, సృష్టిస్థితిలయలనీ సూచిస్తాయని పండితులు చెబుతారు. బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచి వేయడమే! అందుకే వామన జయంతి సందర్భంగా శ్రీహరిని ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి, ఐహిక బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. వామన జయంతి రోజు వైష్ణవ ఆలయాలకు వెళ్లి విష్ణుమూర్తిని దర్శిస్తే శుభప్రదమైన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. రానున్న వామన జయంతి రోజున మనం కూడా ఆ శ్రీహరిని ప్రార్థిద్దాం.అహంకారాన్ని వీడుదాం.

జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details