Utpanna Ekadashi Puja Vidhi In Telugu : తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతినెలా శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో రెండు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది. కార్తిక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకోనున్న సందర్భంగా ఉత్పన్న ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం.
కార్తిక ఏకాదశి విశిష్టత
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం ఒక్క కార్తిక ఏకాదశి వ్రతంతో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని తెలుస్తోంది. ఈ రోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది అశ్వమేధయాగానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించినట్లుగా తెలుస్తోంది.
ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1:01 గంటలకు ప్రారంభమై నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26న జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం.
ఉత్పన్న ఏకాదశి పూజావిధానం
ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఈ రోజు సూర్యోదయంతో నిద్రలేచి నదీ స్నానం చేయడం ఉత్తమం. వీలుకాని పక్షంలో స్నానం చేసే నీటిలో సమస్త పుణ్య తీర్ధాలను ఆవాహన చేసుకుని స్నానం చేయవచ్చు. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. పూజామందిరంలో ఆవునేతితో దీపారాధన చేయాలి. శ్రీ లక్ష్మీ నారాయణుల విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించాలి.