Tirumala Cameras And Copper Foils Auction: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఆ స్వామి రూపాన్ని కనులారా వీక్షించి ధన్యులు అవుతారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పిస్తే.. ఇంకొంతమంది భక్తులు బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, డబ్బులు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచీలు, ఇతరత్రా వస్తువులు హుండీలో వేస్తుంటారు. అలా భక్తులు సమర్పించిన కానుకలను సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. స్వామి వారికి భక్తులు సమర్పించిన పలు కానుకలను ఆఫ్ లైన్ ద్వారా వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ ఆ కానుకలు ఏంటి? వేలం ఏ రోజున నిర్వహిస్తారు? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లోని హుండీలలో భక్తులు వివిధ రకాల కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అలా భక్తులు సమర్పించిన వాటిల్లో కెమెరాలు, కాపర్ -2, సిల్వర్ కోటెడ్ రాగి రేకులను టెండర్ కమ్ వేలం(ఆఫ్ లైన్) వేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనవచ్చని ప్రకటించింది.
మీ ఇంట్లో కనక వర్షం కురవాలా? - వేంకటేశ్వర స్వామిని ఈ రోజున దర్శించుకుంటే చాలు!
కెమెరాల వేలం ఎప్పుడంటే:తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల హుండీల్లో భక్తులు కానుకలుగా సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నట్లు తెలిపింది టీటీడీ. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 06 లాట్లు వేలంలో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రాగి రేకుల వేలం అప్పుడే: అదే విధంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు ఆగస్టు 30, 31వ తేదీలలో టెండర్ కమ్ వేలం వేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఇందులో కాపర్ – 2 (3000కేజీలు) - 15 లాట్లు ఆగస్టు 30న, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు (2,400 కేజీలు) -12 లాట్లు ఆగస్టు 31వ తేదీ వేలానికి ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
ఆసక్తి కలిగిన వారు.. ఇతర వివరాలు తెలుసుకునేందుకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న టీటీడీ ఆఫీసులో జనరల్ మేనేజర్/ఏఈఓ ను సంప్రదించాలని ప్రకటనలో తెలిపింది. లేదంటే 0877-2264429 నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. అదీ లేదంటే టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.orgని సంప్రదించగలరని తెలిపింది టీటీడీ. ఆసక్తి ఉన్నవారు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
భక్తులకు TTD బిగ్ అలర్ట్ - తిరుమల కొండపై నీళ్లు కొన్ని రోజులే సరిపోతాయ్! - అలా చేయాల్సిందేనట!