TTD Cancelled VIP Break Darshan on Weekends: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు చివరి దశకు చేరుకుంటుండడంతో.. భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా స్వామి దర్శనం కోసం కొండపై భక్తులు బారులు తీరుతున్నారు. దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్రవారం, శనివారం, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. అంటే జూన్ 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండబోవు. మిగిలిన రోజుల్లో అంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది.
తిరుమల వెళ్తున్నారా? - ఈ విషయం తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు! - TTD Latest Updates on Devotees Rush
24 గంటలకు పైనే సమయం: టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా.. శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో ఉన్న భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు మొత్తం నిండిపోయయాయి. ఏకంగా రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్ భవనం కూడలి వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది.