Tirumala Srivari Rathotsavam :తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మహారథంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి రథోత్సవం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రథోత్సవం విశిష్టత
అనాది కాలం నుంచి రాజులకు రథసంచారం ఆనవాయితీగా వస్తోంది. వ్యాస మహర్షి రచించిన భారతాది గ్రంథాలలో వివరించిన ప్రకారం యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లుగా తెలుస్తోంది. తిరుమల మాడ వీధులలో శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవ వేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం అనాదిగా కొనసాగుతోంది.
రథోత్సవం అందుకే చూసి తీరాలి
తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే ఈ రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది. ''రధస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే'' అన్న ఆర్ష వాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. ఈ ఆర్ష వాక్కులు అర్థం ఏమిటంటే బ్రహ్మోత్సవాలలో శ్రీవారి రధోత్సవం కళ్లారా చూస్తే జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వాసం. అంటే మళ్లీ పుట్టడం, మళ్లీ చావడం వంటి జన్మాంతర పాపాల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్ర వచనం. తిరు మాఢ వీధులలో రథంపై ఊరేగే శ్రీనివాసునికి భక్తితో నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.