Tiruchanur Brahmotsavam Suryaprabha Vahana Seva: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం అమ్మవారు ఏ వాహనంపై ఊరేగనున్నారు, ఆ వాహన సేవ విశిష్టత ఏమిటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సూర్యప్రభ వాహనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రహోత్సవాలలో ఏడవ రోజైన డిసెంబర్ 4 బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై అమ్మవారు తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
ఆరోగ్యప్రదం సూర్యప్రభ వాహనంపై పద్మావతి దర్శనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఏడో రోజు ఉదయం అమ్మవారు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తారు.
సూర్యప్రభ వాహన సేవ విశిష్టత
సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మీకి నివాస స్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో అమ్మవారు శ్రీవారి గురించి తపమాచరించి కృతార్థులయ్యారు.
ఆరోగ్య ప్రదాత
సనాతన హైందవ సంప్రదాయంలో సూర్యారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రత్యక్ష దైవమైన సూర్య నారాయణుని ఆదిమధ్యాంత రహితుడిగా పేర్కొంటారు. సూర్యారాధన వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
సూర్యప్రభ వాహన దర్శన ఫలం
సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనంపై ఊరేగే దేవేరిని ప్రత్యక్షంగా దర్శించిన భక్తకోటికి రాజ్యాంగపరమైన అధికారాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. అలాగే సూర్యప్రభ వాహనాన్ని కనులారా వీక్షించిన వారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది. సూర్యప్రభ వాహనంపై విహరించే అమ్మవారిని ఆయురారోగ్యాలు ప్రసాదించమని మనసారా వేడుకుంటూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.