తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కార్తిక మాసంలో బిల్వ పత్రాలతో శివపూజ - అనంత కోటి పుణ్యఫలాలు, అష్టైశ్వర్యాలు మీ సొంతం! - SIGNIFICANCE OF BILVA PATRA

శివారాధనకు బిల్వ దళాలకు ఉన్న సంబంధం ఏమిటి? బిల్వ దళాలకు అంతటి విశిష్టత ఎలా వచ్చింది?

Significance of Bilva Patra
Significance of Bilva Patra (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 4:33 AM IST

Significance of Bilva Patra :"త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం" అంటూ మహా దేవుడిని పూజిస్తారు. ఈ త్రిదళ బిల్వ పత్రంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై ఉంటారట. హిందూ ధర్మంలో బిల్వ పత్రానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని మారేడు దళం అని కూడా అంటారు. బిల్వపత్రం మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సాధారణంగా ప్రతి శివాలయంలో బిల్వ వృక్షం ఉంటుంది.

త్రిజన్మ పాపసంహారం
వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం కార్తికమాసంలో బిల్వ దళంతో శివుని అర్చిస్తే మూడు జన్మల్లో చేసిన పాప దోషాలు తొలగిపోతాయని తెలుస్తోంది. యుద్ధంలో గెలవడానికి ఆయుధాలు ఎంత అవసరమో, పాపాలను తొలగించుకోవడానికి బిల్వ దళంతో శివారాధన చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు బిల్వ దళాలకు అంతటి ప్రాశస్త్యం ఎలా కలిగిందో తెలుసుకుందాం.

బిల్వ వృక్షం ప్రాశస్త్యం
పరమశివునికి ప్రీతికరమైన బిల్వ వృక్షానికి ఎంతో విశిష్టత ఉంది. సాధారణంగా అన్ని వృక్షాలు మొదట పువ్వు పూచి, తర్వాత అది కాయగా మరుతుంది. కానీ బిల్వ వృక్షం మాత్రం మొదట కాయగానే మనకు కనిపిస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం కాడ లేని పుష్పాలు, కాయలు, ఆకులు మాత్రమే దేవుని పూజలో ఉపయోగిస్తాం. కానీ బిల్వ దళాలను మాత్రం కాడ తోనే బిల్వ వృక్షం నుంచి సేకరించి శివున్ని ఆరాధిస్తే శుభ ఫలితాలు అందుతాయని శివ పురాణం ద్వారా తెలుస్తోంది.

కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్
సాధారణంగా పూలు కానీ, ఆకులు కానీ ఎండితే పూజకు పనికిరావు కానీ మారేడు దళం ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు. కోటి ఏనుగుల దాన ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల వల్ల కలిగే ఫలం ఒక్క బిల్వపత్రం శివపూజకు సమర్చించడం వల్ల లభిస్తుందని శాస్త్రవచనం.

పార్వతీ దేవి వరం
ఒకసారి పరమశివుడు పార్వతి దేవితో కలసి భూలోకంలో వనవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షాన్ని చూసి పార్వతికి ఆ చెట్టు ఆకులు వింతగా అనిపించి వాటిని చేతిలోకి తీసుకుందట! అప్పుడు మారేడు దళం నమస్కారం చేస్తూ 'అమ్మా పార్వతీదేవి! నా జన్మ తరించింది నీ స్పర్శతో అందట'. అప్పుడు పార్వతి ఏమైనా వరం కోరుకోమనగా బిల్వపత్రం 'నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లీ' అని వేడుకొందట. అందుకు పార్వతీదేవి శివపూజలో విశిష్ట స్థానాన్ని మారేడు దళానికి ప్రసాదించిందంట! అప్పటినుంచి బిల్వపత్రం శివస్తుతి, శివారాధనకు తప్పనిసరి అయింది.

లక్ష్మీస్థానం
కార్తిక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివ పూజ చేయడం ద్వారా అనంత కోటి పుణ్యఫలాలు దక్కుతాయని శివమహాపురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు శ్రీ మహాలక్ష్మీ దేవి మారేడు దళాలలో స్థిరనివాసం ఉంటుంది. అందుకే కార్తిక మాసంలో శివుని మారేడు దళాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

ఆధ్యాత్మికమే కాదు ఆరోగ్యం కూడా
ఆయుర్వేద శాస్త్రంలో వివరించిన ప్రకారం బిల్వ వృక్షం కింద సేద తీరే సమయంలో ఆ చెట్టు గాలి మనపై వీస్తే శరీరంలో అనారోగ్యాలు, దోషాలు పోతాయని తెలుస్తోంది.

ఈ కార్తీకమాసంలో మారేడు దళాలతో శివుని పూజిద్దాం- ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం.

ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details