Indira Ekadashi Significance : వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం, పితృ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి సద్గతులు లభిస్తాయని శాస్త్ర వచనం. అంతేకాదు ఇందిరా ఏకాదశి పూజను భక్తిశ్రద్ధలతో ఆచరించడం వలన వంశాభివృద్ధి కూడా కలుగుతుంది.
ఇందిరా ఏకాదశి విశిష్టత
భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు గల 15 రోజుల కాలాన్ని పితృపక్షాలు అంటారు. ఈ పదిహేను రోజులపాటు పితృదేవతల అనుగ్రహం కోసం చేసే స్నాన, దాన జపాదులు వలన పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధిని కలిగిస్తారని శాస్త్రవచనం. ముఖ్యంగా భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ రోజు పితృదేవతలను స్మరించుకుంటూ నదీస్నానం, పిండప్రదానాలు, దానాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.
ఇందిరా ఏకాదశి ఎప్పుడు?
ఈ ఏడాది సెప్టెంబర్ 27 శుక్రవారం మధ్యాహ్నం 1:29 నిమిషాలకు ఏకాదశి మొదలై మరుసటి రోజు సెప్టెంబర్ 28వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:49 నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది. పితృకార్యాలు చేయడానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిథి ఉండాలి. అలాగే ఏకాదశి వ్రతం ఆచరించాలన్న సూర్యోదయంతో ఏకాదశి తిథి ఉండాలి కాబట్టి ఈ నెల 28వ తేదీనే ఇందిరా ఏకాదశి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
ఇందిరా ఏకాదశి పూజా విధానం
ఇందిరా ఏకాదశి వ్రతం చేసేవారు ఈ రోజు విశేషించి నదీస్నానం చేస్తే చాలా పుణ్యం. వీలుకానివారు స్నానం చేసే నీళ్లల్లో సమస్త నదీ జలాలను, సకల తీర్ధాలను ఆవాహన చేసి స్నానం చేస్తే నదీ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శ్రీ లక్ష్మీ నారాయణుల చిత్ర పటాలను గంధం కుంకుమలతో అలంకరించాలి. అనంతరం పసుపు రంగు పూలతో లక్ష్మీ నారాయణులను అర్చించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. పులిహోర, చక్రపొంగలి నివేదించాలి. కర్పూర నీరాజనం సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.
పితృదేవతల కోసం ఇలా చేయాలి?
- మహాలయ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి రోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి.
- పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని పూర్వీకులకు దానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని పురాణాల్లో వివరించారు.
- ఇందిరా ఏకాదశి రోజు పితృదేవతలకు సద్గతులు కలగడం కోసం భగవద్గీత మొత్తం చదవడం సాధ్యం కాకపోతే, కనీసం ఏడో అధ్యాయమైనా చదవడం కానీ, వినడం కానీ చేయాలి.
- సాయంత్రం వేళ తులసి చెట్టు ముందు నేతి దీపం వెలిగించి పితృదేవతల అనుగ్రహం కోసం ప్రార్థించాలి.
- ఇందిరా ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలగుతుంది. అంతేకాదు మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి.
- ఇందిరా ఏకాదశి రోజు మధ్యాహ్నం సమయంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరిస్తే, పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది.
- కనుక రానున్న ఇందిరా ఏకాదశి రోజు పెద్దలు సూచించినట్లుగా స్నానదాన జపాదులు చేసి పితృదేవతల అనుగ్రహాన్ని పొందుదాం.శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.