Minister Tummala On Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సన్నబియ్యానికి బోనస్ కచ్చితంగా ఇస్తామన్నారు. డిసెంబరు 7లోగా రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని, కేబినెట్ సబ్-కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రైతుభరోసా ఇస్తామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలు ఆయా పార్టీలో అంతర్గత ఆధిపత్యం కోసమో అధికారంలోకి రావాలన్న ఆత్రుతలోనో రైతాంగాన్ని బలిపెట్టవద్దని మంత్రి ధ్వజమెత్తారు.
దేశంలోనే మొదటి స్థానంలో : భారతీయ జనతా పార్టీకి రైతులపై నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం తేమ వంటి విషయాల్లో నిబంధనలు, విధివిధానాలను రైతులకు అనుకూలంగా మార్చాలన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధిక వరి దిగుబడి వచ్చిందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 46 లక్షల టన్నులతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు వివరించారు. ప్రభుత్వ సూచనల మేరకు సన్నబియ్యం సాగుకు రైతులు ముందుకొచ్చారని తెలిపారు. గతేడాది 25 లక్షల ఎకరాల్లో ఉండగా ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు వేశారని వివరించారు.
దొడ్డు బియ్యం 41 లక్షల నుంచి 26 లక్షల ఎకరాలకు పడిపోయిందని తుమ్మల వివరించారు. గతేడాది ఈరోజుతో పోలిస్తే ఈ సంవత్సరం ధాన్యం సేకరణ, బిల్లుల చెల్లింపు వంటివి ఎక్కువగానే ఉన్నాయని తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో 27 జిల్లాల్లో 7 వేల 411 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2 వేల 222కోట్ల రూపాయల విలువైన 9 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి అన్నదాతలకు రూ.622 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. బోనస్ చెల్లించే ప్రక్రియ కొనుసాగుతోందని తుమ్మల తెలిపారు. పత్తి దిగుబడి తగ్గినప్పటికీ కొనుగోళ్లు మాత్రం గతేడాదితో పోలిస్తే పెరిగాయని వివరించారు.
Tummala Fires On KTR, Harish Rao : హరీశ్ రావు, కేటీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినప్పటికీ సరిచేసుకుంటూ రైతులకు ఇచ్చిన హామిలను అమలు చేస్తున్నామన్నారు. సన్నరకం వరికి బోనస్ వస్తుందని ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. ఆర్థిక శాఖ నుంచి రావల్సి ఉంటుంది కాబట్టి ధాన్యం సేకరించిన వారం రోజుల్లో ఖాతాల్లో జమ అవుతాయన్నారు. గతేడాది కన్నా వరి దిగుబడి ఎక్కువగా వచ్చిందని కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే వరి ధాన్యం పెరిగిందని గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రచారంలో నిజం లేదని తేలిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తాం : మంత్రి తుమ్మల
మరో 20 లక్షల మందికి త్వరలోనే రుణమాఫీ : మంత్రి తుమ్మల - MNISTER THUMMAL FIRE ON BJP LEADERS