Subrahmanya Sashti Pooja Vidhanam :హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే.. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజ కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు?:మార్గశిర మాసంలో ఈ ఏడాది షష్ఠి తిథి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలై డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 నిమిషాల వరకు కొనసాగుతుందని మాచిరాజ కిరణ్ కుమార్ చెబుతున్నారు. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం.. సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండగ జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహు కేతు దోషాలు, కాల సర్ప దోషాలు, కుజ దోషాలన్నింటిని నుంచి బయటపడవచ్చని, అలాగే అప్పుల సమస్యలు కూడా తొలిగిపోతాయని చెబుతున్నారు.
పూజా విధానం:
- సుబ్రహ్మణ్య షష్టి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాదికాలు పూర్తి చేసుకోవాలి.
- ఆ తర్వాత పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి.
- ఆ వస్త్రం మీద ఆరు ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వేల్ అనే ఆయుధాన్ని ధరించిన ఫొటో అయినా ఉంచాలి. ఆ ఫొటోకు గంధం, కుంకుమ బొట్లు అద్దాలి.
- ఆ తర్వాత ఫొటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి ఆరు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ ఆరు వత్తులు స్వామి వారి ఆరు ముఖాలకు సంకేతం. లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్ఠాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా 9 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి.
- అనంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి. అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు, కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేస్తూ స్వామి వారి 108 నామాలు చదువుకోవాలి. ఒకవేళ 108 నామాలు చదవలేని వారు "ఓం సాం శరవణ భవా" అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలుని బట్టి జపించాలి.
- అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలు అయినా నైవేద్యంగా పెట్టచ్చు.
అభిషేకాలు: సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చని లేనివారు గుడికి వెళ్లి అభిషేకం చేస్తే మంచిదని చెబుతున్నారు.
- ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసంపదలు లభిస్తాయని, ఆవు పెరుగుతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని, ఆవు నెయ్యితో అభిషేకం చేయిస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయని వివరిస్తున్నారు. అలాగే అప్పులతో ఇబ్బంది పడే వారు బియ్యప్పిండితో అభిషేకిస్తే మంచిదంటున్నారు. గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుంది.
- ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫొటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్రపూలతో పూజించాలి. ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయని అంటున్నారు.