Srirangam Temple History In Telugu : భారతదేశం అతి ప్రాచీన ఆలయాలకు నెలవు. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. మరి ముఖ్యంగా తమిళనాట అతి ప్రాచీన ఆలయాలు దర్శించుకోవచ్చు. ధనుర్మాసం ప్రత్యేకంగా తమిళనాట ఓ ప్రాచీన ఆలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
భూలోక వైకుంఠం శ్రీరంగం
శ్రీవైష్ణవ 108 దివ్యదేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య వెలసింది. శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. భూలోక వైకుంఠంగా పేరొందిన ఈ ఆలయం ప్రపంచంలోని విష్ణు ఆలయాలలో కెల్లా అతి పెద్దది. శ్రీరంగం ఆలయాన్ని "ఇండియన్ వాటికన్" గా కూడా పిలుస్తారు.
ఆలయ స్థల పురాణం
ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుర సంహారం చేసిన అనంతరం విభీషణుని భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇస్తాడు. అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడ కింద పెట్టవద్దని చెబుతాడు. ప్రయాణ బడలికతో విభీషణుడు రాముడు చెప్పిన మాటను మరచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కిందపెట్టి కాసేపు విశ్రమిస్తాడు. కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తబోగా ఆ విగ్రహం పైకి లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మ చోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. అయితే విభీషణుడు కోరిక మేరకు రంగనాధ స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతాడు. ఆనాటి నుంచిశ్రీరంగంలో శ్రీరంగనాధుడు స్వయంభువుగా కొలువై పూజలందుకుంటున్నాడు.
అతి పెద్ద ఆలయం
సుమారు 157 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగ మూర్తి విగ్రహం ఉంది. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. గుడి ప్రాంగణంలో 50 పైచిలుకు దేవతా మూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. బహుశా మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవంటే ఆశ్చర్యం కాదు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం
శ్రీరంగం దేవాలయం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది. పైకప్పుకు బంగారు తాపడం చేశారు. గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న స్వామిని చూడడానికి రెండు కళ్లు కూడా చాలవు.