Srikalahasti Pathala Vinayaka Temple : తొలిపూజ అందుకునే గణనాధుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రాలు అనేకం ఉన్నాయి. అందులో శ్రీకాళహస్తి కూడా ఒకటి. పంచ భూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుని దర్శనం చేసుకోకుంటే యాత్ర అసంపూర్తి అవుతుంది. ఎంతో మహిమాన్వితమైన పాతాళ వినాయకుని ప్రశస్తి తెలుసుకుందాం.
కావ్యాలకెక్కిన పాతాళ వినాయకుడు
శ్రీకాళహస్తిలో వెలసిన పాతాళ వినాయకుడు స్వయంభువు. ఈ వినాయకుని గురించి ధూర్జటి కవి శ్రీ కాళహస్తి మహాత్మ్యంలో వివరించారు. అలాగే శ్రీనాథుడు రచించిన హరవిలాసంలో కూడా ఈ స్వామి ప్రస్తావన ఉంది.
పాతాళ వినాయకుని ఆవిర్భావం వెనుక ఉన్న గాథ
శ్రీకాళహస్తిలో నలభై అడుగుల లోతులో పాతాళ వినాయకుడు వెలిసి ఉండడం వెనుక ఓ గాథ ఉంది. పూర్వం అగస్త్య మహాముని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించి ఈ ప్రాంతంలో ఓ జీవనది ఉంటే బాగుంటుందని పరమశివుని ప్రార్థించాడట. శివుని అనుగ్రహంతో అక్కడ సువర్ణముఖి నది పాయ ఏర్పడింది. కానీ అందులో నీరు లేవు. ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించిన అగస్త్యునికి విఘ్నాధిపతి అయిన గణపతిని ప్రార్థించకుండా ఈ కార్యానికి పూనుకోవడం వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకొని గణపతిని ప్రార్థిస్తాడు.