తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

విష్ణుమూర్తికే తప్పని శాపాలు- పతివ్రత కోపంతో రాయిగా మారిపోయాడంట! - Sri Vishnu And Vrinda Story - SRI VISHNU AND VRINDA STORY

Sri Vishnu Jalandhar And Vrinda Story: త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితి కారకుడు. తన భక్తుల కష్టాలను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించి శరణు కోరిన వారిని రక్షించాడు. మరి అలాంటి విష్ణుమూర్తి కూడా ఒకానొకప్పుడు శాపానికి గురై రాయిగా మారిపోయాడంట! ఆ కథేమిటో ఈ ఆసక్తికర కథనంలో తెలుసుకుందాం.

Lord Sri Vishnu
Lord Sri Vishnu (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 4:04 AM IST

Sri Vishnu Jalandhar And Vrinda Story:భారతదేశం కర్మభూమి. ఈ దేశంలో స్త్రీలను తల్లిగా, అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయం. పాతివ్రత్యానికి పెట్టింది పేరు భారతదేశంలో స్త్రీలు. పతివ్రతల శాపానికి భగవంతుడు కూడా రాయిగా మారిన వైనం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే!

జలంధరుని ఆగడాలు
వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతంలోని తులసీ మాత కథను చదివితే పాతివ్రత్యాన్ని ఎంతటి గొప్ప మహిమ ఉందో అర్థం అవుతుంది. పూర్వం జలంధరుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య బృంద. ఆమె గొప్ప పతివ్రత. సాక్షాత్తూ వైకుంఠంలో సదా విష్ణుమూర్తి సరసన ఉండే తులసీ.ఈ జలంధరునికి ఓ వరం ఉండేది. బృంద పాతివ్రత్యానికి భంగం వాటిల్లనంత వరకు అతనికి మరణం రాదనే వరం పొందిన జలంధరుడు మితిమీరిన గర్వంతో దేవతలను, గంధర్వులను, మహర్షులను బాధిస్తూ ఉండేవాడు.

విష్ణుమూర్తిని ఆశ్రయించిన దేవతలు
జలంధరుని ఆగడాలు భరించలేని దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు. జలంధరుని చంపడం అంత తేలిక కాదని, బృంద పాతివ్రత్యమే జలంధరుని కాపాడుతోందన్న విషయం తెలిసిన విష్ణువు ఎలాగైనా జలంధరుని సంహరిస్తానని దేవతలకు అభయమిస్తాడు.

బృంద పాతివ్రత్య భంగం
వరగర్వంతో అహంకారంతో శివుని మీదకే యుద్ధానికి వెళ్తాడు జలంధరుడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపంలో బృంద వద్దకు వెళ్తాడు. తన భర్త యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చాడని భావించి బృంద అతని పాదాలను స్పృశిస్తుంది. ఎప్పుడైతే ఆమె పర పురుషుని పాదాలను స్పృశిస్తుందో ఆమె పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది. అక్కడ పరమ శివుని చేతిలో జలంధరుడు మరణిస్తాడు. అంతలో శ్రీ మహా విష్ణువు తన నిజరూపంలో బృంద ముందు సాక్షాత్కరిస్తాడు.

విష్ణుమూర్తికి బృంద శాపం
అక్కడ యుద్ధంలో జలంధరుడు మరణించాడన్న వార్త తెలుస్తుంది. శ్రీ మహా విష్ణువు మాయ రూపంలో వచ్చి తన పాతివ్రత్యానికి భంగం కలిగించి తన భర్త మరణానికి కారణమయ్యాడన్న ఆగ్రహంతో బృంద విష్ణుమూర్తిని రాయిగా మారిపొమ్మని శపిస్తుంది.

శాపోపశమనం
విష్ణుమూర్తికి బృంద ఇచ్చిన శాపం తెలుసుకున్న లక్ష్మీదేవి బృంద వద్దకు వెళ్లి తన భర్తను క్షమించి శాపాన్ని వెనక్కి తీసుకోమని, లేకుంటే సకల లోకాలు స్థంభించిపోతాయని వేడుకుంది. దీంతో బృందా దేవి తన శాపాన్ని ఉపసంహరించుకుంది.

తులసిగా మారిన బృంద
బృంద తన భర్త చితిపై సతీసహగమనం చేస్తుంది. ఆమె శరీరం పంచభూతాల్లో కలిసి భస్మం ఏర్పడుతుంది. ఆ భస్మం నుంచి పుట్టిన మొక్కకు విష్ణువు తులసీ అని నామకరణం చేస్తాడు. ఈ తులసి తిరిగి వైకుంఠాన్ని చేరుతుంది. దేవి భాగవతంలో ఈ కథ సవివరంగా ఉంటుంది. బృందా దేవి విష్ణువును శాపం నుంచి విముక్తి చేసిన ప్రదేశమే నేపాల్ లోని ముక్తినాథ్ ధామ్! ఈ ప్రదేశాన్ని దర్శిస్తే సకల పాపాలు పోతాయని విశ్వాసం. ఓం నమో నారాయణాయ ఓం శ్రీ తులసి దేవ్యై నమః


ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

విష్ణుమూర్తి కూర్మావతారం వెనుక కారణమేంటి? కూర్మ జయంతి రోజు ఏం చేయాలి? - Kurma Jayanti 2024

ఆషాఢ శుద్ధ ఏకాదశి విశిష్టత.. విష్ణుమూర్తి యోగనిద్ర అంతరార్థమేంటి..?

ABOUT THE AUTHOR

...view details