తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

అనంత పద్మనాభ వ్రత కథ - చదివినా, విన్నా సమస్త కష్టాలు తొలగిపోతాయ్​! - Sri Ananta Padmanabha Vratha Katha - SRI ANANTA PADMANABHA VRATHA KATHA

Sri Ananta Padmanabha Vratha Katha : హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి వ్రతానికి, నోముకు వెనుక ఓ పౌరాణిక గాథ ఉంటుంది. పూజ చేసుకున్న వారు పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణం అయినట్లుగా భావిస్తారు. అనంత పద్మనాభ వ్రత విధానాన్ని తెలుసుకున్నాం కదా! ఈ కథనంలో వ్రత కథను తెలుసుకుందాం.

Sri Ananta Padmanabha Vratha Katha
Sri Ananta Padmanabha Vratha Katha (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 8:36 AM IST

Sri Ananta Padmanabha Vratha Katha :పూర్వం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు కనుక్కోవడానికి శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో ధర్మరాజు కృష్ణునితో అరణ్యవాసంలో తాము పడుతున్న కష్టాలను పోగొట్టే వ్రతమేదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే భయంకరమైన కష్టాలు, కటిక దారిద్య్రం తొలగిపోతుందని చెప్పి ఆ వ్రత విధానాన్ని సవివరంగా చెప్పాడు.

సుమంతుని కథ
పూర్వం కృతయుగంలో వేదవేదాంగ శాస్త్రాలలో పండితుడు అయిన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్త వయస్సు వచ్చేసరికి తల్లి దీక్షాదేవి మరణించింది. సుమంతుడు మళ్లీ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య పరమ గయ్యాళి.

సత్తుపిండి బహుమానం
సుమంతుడు తన కుమార్తెని, కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకుని ఈ విషయం రెండవ భార్యకు చెప్పాడు. ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి, పెళ్లి కోసం వాడగా మిగిలిన సత్తు పిండిని అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపించాడు.

అనంత పద్మనాభ స్వామి వ్రతం చూసిన సుగుణవతి
సుగుణవతి తన భర్త కౌండిన్యతో కలిసి వెళ్తుండగా మార్గమధ్యలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్రని చీరలు ధరించి 'అనంత పద్మనాభ స్వామి వ్రతం' నిర్వహిస్తున్నారు. సుగుణవతి వారి దగ్గరికి వెళ్లి ఆ వ్రతం గురించి వారికి అడిగింది. వాళ్లు అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశి రోజున ఆచరించాలని చెప్పారు. వ్రత విధానాన్ని కూడా వివరించారు.

వ్రతవిధానం
వ్రతం ఆచరించే స్త్రీ నదీ స్నానం చేసి, ఎర్రని చీర ధరించి, వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయంతో అలికి, పంచ వర్ణాలతో అష్టదళ పద్మం వేసి, ఆ వేదికకి దక్షిణ భాగంలో ఉదకంతో కలశాన్ని పెట్టి, వేదికకి మరో భాగంలోకి యమునా దేవిని, మధ్యభాగంలో దర్భలతో తయారు చేసుకున్న సర్పాకృతిని ప్రతిష్టించి అందులోకి శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించి, అర్చించాలి.

అన్నీ పద్నాలుగే!
పూజకు కావలసిన ద్రవ్యాలు పద్నాలుగు రకాలు ఉండేలా చూసుకోవాలి. పద్నాలుగు ముడులు, కుంకుమతో తడిపిన కొత్త తోరాన్ని ఆ అనంతపద్మనాభస్వామి దగ్గర పెట్టి పూజించి, ఏడున్నర కిలోల గోధుమ పిండితో 28 అరిసెలు చేసి, అనంత పద్మనాభ స్వామికి నివేదించి, వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానం ఇచ్చి, మిగిలిన అరిసెలు భక్తిగా భుజించాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు వ్రతం చేసిన తర్వాత ఉద్యాపన చేయాలని ఆ స్త్రీలు సుగుణవతితో చెప్పారు.

అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించిన సుగుణవతి
సుగుణవతి వెంటనే అక్కడే శ్రీ అనంతపద్మనాభస్వామి వ్రతం ఆచరించి, తన తండ్రి ఇచ్చిన సత్తు పిండితో అరిసెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం సంప్రాప్తించింది.

కౌండిన్యుని గర్వం
వ్రత మహాత్యం వలన వచ్చిన ఐశ్వర్యంతో కౌండిన్యుడికి గర్వం బాగా పెరిగింది. ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకుని, తోరం కట్టుకుని భర్త దగ్గరకి రాగా, కౌండిన్య మహర్షి తన భార్య సుగుణవతిని, ఆమె ధరించిన తోరాన్ని చూసి కోపంగా 'ఎవరిని ఆకర్షించాలని ఇది చేతికి కట్టుకున్నావు' అంటూ ఆ తోరాన్ని తెంపి నిప్పులలో పడేశాడు.

ఆగర్భ దరిద్రుడైన కౌండిన్యుడు
అహంకారంతో కౌండిన్యుడు చేసిన పనికి ఆ క్షణం నుండి వారికి కష్టకాలం మొదలై, ఆగర్భ దరిద్రులు అయిపోయారు. కౌండిన్యుడిలో పశ్చాత్తాపం మొదలైంది.

అనంతుని కోసం అన్వేషణ
చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కౌండిన్యుడు అనంత పద్మనాభ స్వామిని దర్శించాలన్న కోరికతో స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు.

కౌండిన్యునికి కనిపించిన విచిత్రాలు
అనంత పద్మనాభ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరిన కౌండిన్యుడు మార్గమధ్యలో పళ్లతో నిండుగా ఉన్న మామిడిచెట్టుపై ఎటువంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు. అలాగే పచ్చగా, నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగానే ఉన్న ఆంబోతుని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలోకి దిగకుండా గట్టునే నిలబడి ఉన్న జల పక్షులను, మరొక ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఒక గాడిదను, ఏనుగుని చూసి ఆశ్చర్యపోతూ వాటిని 'మీకు అనంతపద్మనాభస్వామి తెలుసా?' అని అడిగాడు. అవి అన్నీ తమకు తెలియదు అని బదులిచ్చాయి.

సొమ్మసిల్లిన కౌండిన్యుడు - అనంతుని అనుగ్రహం
కౌండిన్యుడు అనంత పద్మనాభ స్వామిని అన్వేషిస్తూ అన్ని చోట్లా గాలించి ఒక ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు శ్రీ అనంత పద్మనాభ స్వామికి కౌండిన్యుడిపై జాలి కలిగింది. వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వచ్చి, సేదతీర్చి తన నిజరూపంతో దర్శనం ఇచ్చాడు. కౌండిన్య మహర్షి అనంత పద్మనాభ స్వామిని అనేక విధాల స్తుతించాడు. తన దారిద్య్రం తొలగించి, అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే అని ఆ స్వామి అనుగ్రహించాడు.

కౌండిన్యుని అనంత పద్మనాభ స్వామి జ్ఞానబోధ
కౌండిన్యుడు తాను మార్గమధ్యలో చూసిన వింతలు గురించి అనంత పద్మనాభ స్వామిని అడిగాడు. దానికి అనంత పద్మనాభ స్వామి ఈ విధంగా బదులిచ్చాడు. 'ఓ విప్రోత్తమా, తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు దానం చేయని వాడు అలా ఒంటరి మామిడిచెట్టుగాను, మహా ధనవంతుడిగా పుట్టినా అన్నార్తులకు అన్నదానం చేయనివాడు అలా ఒంటరి ఆంబోతుగాను, తాను మహారాజుని అనే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షులుగా, నిష్కారణంగా ఇతరులను దూషించేవాడు గాడిదగా, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులా జన్మిస్తారు. నీకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించే విధంగా చేశాను. నువ్వు 'అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని' పద్నాలుగు సంవత్సరాలు చేసినట్లయితే నీకు నక్షత్ర లోకంలో స్థానం ఇస్తాను' అని చెప్పి శ్రీమహావిష్ణువు మాయం అయ్యాడు.

నక్షత్ర లోకం చేరిన కౌండిన్యుడు
కౌండిన్య మహర్షి తన ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగినది అంతా తన భార్య సుగుణవతికి చెప్పాడు. ఆనాటి నుంచి కౌండిన్యుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరించి భార్యతో కలిసి నక్షత్ర లోకం చేరుకున్నాడని ధర్మరాజుకు, శ్రీకృష్ణుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలిపాడు.

ఈ వ్రత కథ చదివినా, విన్నా సమస్త కష్టాలు తొలగిపోయి, ఆగర్భ దరిద్రులు కూడా అష్టైశ్వర్యాలతో తులతూగి అంత్యమున మోక్షం పొందుతారు.

జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

దారిద్ర్యాన్ని దూరం చేసే 'అనంత పద్మనాభ స్వామి వ్రతం'! ఇలా పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి! - Anantha Padmanabha Swamy Vratham
గణపతి ఉత్సవాల్లో 'మోరియా' అని ఎందుకంటారో తెలుసా? - Ganpati Bappa Morya Meaning

ABOUT THE AUTHOR

...view details