Somvati Amavasya Story In Telugu :ఏ వ్రతమైనా, పూజైనా పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే పూజ సంపూర్ణం అవుతుంది. అందుకే వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి.
సోమావతి అమావాస్య కథ
పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు, యుక్త వయస్కురాలైన కూతురితో నివసిస్తుండేవారు. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేక పోయారు. ఒకరోజు ఒక మునిపుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి, భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఈ యువతికి వివాహ యోగం లేదని చెప్పెను. అందుకు వారు కలత చెంది ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కోరారు. అప్పుడు ఆ ముని అక్కడికి దగ్గరలో 'సోమ' అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదని, వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందినచో వివాహము జరుగునని తెలిపెను.
అంతట ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతి దేవి ఇంట్లో ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమావతి ఆ అమ్మాయి తన ఇంట్లో పని చేయడానికి కారణమేమిటని అడుగగా, ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారమంతా సోమావతికి తెలిపింది.
అప్పుడు సోమావతి ఆ యువతికి తన పాపిట నుంచి సగం కుంకుమను తీసి ఇవ్వగా, ఆ యువతి దానిని ధరించెను. కొన్ని దినములకు ఆ అమ్మాయికి వివాహ ఘడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది. కానీ ఇక్కడ సోమావతి పాపిటలో కుంకుమ తగ్గగానే, ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు. అంతట సోమావతి కఠోర నిష్టతో పరమ శివుని ధ్యానించి, రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి, పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి, మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలిగి, పునర్జీవితుడయ్యాడు. ఆనాటి నుంచి సోమావతి అమావాస్యకు విశిష్టత ఏర్పడింది. సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైనా శివాలయంలో వెలిగించాలని పెద్దలంటారు.
సోమావతి అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత సోమావతి అమావాస్య కథను కూడా చదువుకుంటే పూజాఫలం పూర్తిగా దక్కుతుంది.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.