Simple Tips For Laxmi Devi Anugraham In Telugu :ధనమంటే ఎవరికీ ఇష్టం ఉండదు? విలాసంగా జీవించాలన్న ఆశ లేకపోయినా నిత్యజీవితంలో ధనం ప్రతి ఒక్కరికీ అవసరమే! కొంత మందికి అదృష్టవశాత్తూ సునాయాసంగా ధనం సమకూరితే, మరికొంతమందికి ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు బొటాబొటిగా కనీస అవసరాలకు కూడా చాలీ చాలనట్టుగా ఉంటుంది. ఇలాంటప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని పరిహారాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆ పరిహారాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వీటిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం
ఆర్యభట్ట రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ప్రత్యేకంగా కొన్నిటిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారు. బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణాలలో కూడా శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన విధి విధానాల గురించి ప్రస్తావన ఉంది. డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే! అందుకోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారు పెద్దలు.
శ్రీఫలం
లఘు నారికేళాన్ని శ్రీఫలం అని కూడా అంటారు. పేరులోనే శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి, ఈ లఘు నారికేళం అంటే చిన్న కొబ్బరి కాయ పూజా గదిలో ఉంచుకుని ప్రతి శుక్రవారం పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సొంతమవుతుందని విశ్వాసం. అంతేకాదు ఈ శ్రీ ఫలాన్ని ఏలినాటి శనితో బాధపడుతున్న వారు పూజా గదిలో, వ్యాపారంలో లాభాలు కోరుకునేవారు డబ్బు ఉంచే పెట్టెలో ఉంచితే నిరంతరం ధన ప్రవాహం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
శ్రీ సూక్తం
రుగ్వేదంలో వివరించిన శ్రీ మహాలక్ష్మీదేవి పూజలో పఠించే స్తోత్రమే శ్రీసూక్తం. అమ్మవారిని స్తుతిస్తూ సాగే ఈ శ్రీ సూక్తం వేద మంత్రాలతో కూడినది. శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే శ్రీసూక్తం తప్పుల్లేకుండా సరిగ్గా ఉచ్చరించకపోతే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అందుకే ముందుగా శ్రీసూక్తాన్ని పండితుల దగ్గర స్వర సహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ శ్రీ సూక్తం ప్రతిరోజూ ఇంట్లో సామాజిక మాధ్యమాల ద్వారా విన్నా, చూసినా శుభ ప్రదమే! ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం శ్రీ సూక్తం మారుమ్రోగుతూ ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలకు లోటుండదని పెద్దలు అంటారు.