Shukla Durga Ashtami Puja Benefits In Telugu : వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమిని శుక్ల దుర్గాష్టమి అంటారు. అయితే మే 15వ తేదీ బుధవారం శుక్ల దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని ఎలా పూజిస్తే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆరోజు ఏం చేయాలి?
వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారు శుక్ల దుర్గాష్టమి రోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి శుచియై ఈ రోజు ఉపవాసం ఉంటానని మనసులో సంకల్పించుకోవాలి. ఇంట్లో దుర్గాదేవి ఫొటో ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, రాగి పాత్రలో గంగా జలాన్ని పోసి దానిపై కొబ్బరికాయను ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం దుర్గాష్టోత్తరం చదువుకుని అమ్మవారికి నిమ్మకాయలతో చేసిన పులిహోర నైవేద్యంగా పెట్టాలి. తర్వాత కర్పూర నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి.
దుర్గాదేవి ఆలయంలో పూజ
ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత సమీపంలోని దుర్గా దేవి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని, ఎరుపు రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగులో ఉండే పుష్ప మాలను సమర్పించాలి. కుదిరితే అమ్మవారికి నిమ్మకాయల దండను కూడా ఇవ్వవచ్చు. ఇంటికి తిరిగి వచ్చి సాయంత్రం వరకు అమ్మవారి ధ్యానంలో కాలం గడపాలి. సూర్యాస్తమయం తర్వాత తిరిగి స్నానం చేసి అమ్మవారి సమక్షంలో దీపారాధన చేసి అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి.