Silver Coins Distribution in Bhagyalakshmi Temple : రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. పూల దండలు, మామిడి కొమ్మలతో అందంగా అలంకరించిన ఇళ్లన్నీ దీపపు కాంతులీనాయి. ఇంటిల్లిపాదీ టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాలలో మునిగి తేలారు. దివ్వెల కాంతుల వెలుగులు, చిన్నారుల కేరింతలతో ఊరూవాడా సందడిగా మారాయి. లోగిళ్లతో పాటు దుకాణాలు దీపాల వెలుగుల్లో కాంతులీనాయి. ప్రజలందరూ లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మహా నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు : హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. యువకులు రోడ్లపైకి వచ్చి వెలుతురు విరజిమ్మే చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులను కాల్చి సంతోషంగా పండుగను ఆస్వాదించారు. పలు ప్రాంతాల్లో నరకాసుల వధ నిర్వహించారు. దీపావళి వేళ నగరం బాణాసంచా శబ్దాలతో మార్మోగిపోయింది. ప్రముఖులు సైతం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు : దీపావళి వేళ లోగిళ్లన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వ్యాపారులు లక్ష్మీదేవికి వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు. దీపావళి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అర్చకులు ధనలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్‌లోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహాశక్తి ఆలయంలోని ముగ్గురు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వెండి నాణేలు పంపిణీ : ముఖ్యంగా హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీపావళి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలు పంపిణీ చేశారు. ఏడాదంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో తయారు చేసిన నాణేలను దీపావళి రోజు భక్తులకు అందించడం భాగ్యలక్ష్మి ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. వెండి నాణేల కోసం భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.
టపాసుల వెలుగులతో మెరిసిన లోగిళ్లు - రాష్ట్రవ్యాప్తంగా హ్యాపీ దీపావళి