Flowers Should not Offer to Shiva :మహా శివరాత్రి రోజున శైవ క్షేత్రాలన్నీ శివ నామస్మరణతో మార్మోగిపోతాయి. హరహర మహాదేవ అంటూ భక్తులు ప్రణమిల్లుతారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. చాలా మంది ఇంట్లోనే శివయ్యకు పూజలు చేస్తారు. అయితే, శివపూజలో ఏ పూలు వినియోగించాలి? ఏ పూలు అస్సలు ముట్టుకోకూడదు? అనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు. అందుకే, ఈ స్టోరీ మీకోసం. ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఏ పూలను శివయ్య మెచ్చడో ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తుమ్మి పుష్పాలు :తొడిమ లేకుండా ఉండే తుమ్మి పూలతో పూజ చేస్తే శివయ్యకు చాలా ఇష్టం. వీటితో పరమేశ్వరుడిని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పద్మాలు :మనం ఒక్కోసారి పొరపాటుగా ఇతరులను దూషిస్తాం. ఆ దోషాలు పోవాలంటే శివరాత్రి రోజున పద్మ పుష్పాలతో శంకరుడిని పూజించాలట. తప్పులు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందట.
మందార పూలతో : శివరాత్రి రోజున మందారాలతో పరమేశ్వరుడిని పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
గన్నేరు పూలు :దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శివరాత్రి రోజున గన్నేరు పూలతో ఈశ్వరుడిని పూజించాలని సూచిస్తున్నారు. దీంతో ఆరోగ్యం కుదురుకుంటుందని చెబుతున్నారు.
సన్నజాజులు :శివరాత్రి వేళ సన్నజాజులతో శివయ్యను పూజిస్తే, పెళ్లికాని వారికి వివాహ ఘడియలు దగ్గరవుతాయట. వయసు పెరిగినా వివాహం కాని వారికి ఉపయోగకరంగా ఉంటుందట.