Shirdi Sai Leelalu In Telugu : షిర్డీ సాయిబాబా సంస్థ వారు అందించిన సాయి సచ్చరిత్రలో వివరించిన ప్రకారం షిర్డీ సాయి తన 16 సంవత్సరాల వయసులో షిర్డీ గ్రామంలో ప్రవేశించారు. పాడుబడిన మసీదులోని నివసిస్తూ ఉండేవారు. తన భక్తులకు ఏ ఆపద వచ్చినా బాబా వారు తానే స్వయంగా ఆపద తొలగించేందుకు పూనుకునేవారు. ఈ సమయంలో బాబా ప్రదర్శించిన లీలలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి! అలాంటి ఓ లీల గురించి తెలుసుకుందాం.
బాబా గోధుమలు విసురుట
శ్రీ సాయిబాబాకు ప్రియమైన భక్తుడు, అత్యంత సన్నిహితుడు హేమాడపంత్ స్వయంగా అనుభవించిన లీల ఇది. దాదాపు 1910 ప్రాంతంలో ఓ రోజు హేమాడపంత్ బాబా దర్శనానికి మసీదుకు వెళ్లేసరికి బాబా గోధుమలు విసరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అది చూసి ఆయనకు ఆశ్చర్యం కలిగింది. బిక్షాటన చేస్తూ జీవించే బాబాకు గోధుమలు విసిరే అవసరం ఎందుకు వచ్చింది? ఆ గోధుమ పిండిని ఆయన ఏమి చేసుకుంటాడు ఇలా అనేక సందేహాలు ఆ సమయంలో ఆయనను చుట్టుముట్టాయి.
గుమికూడిన భక్తులు
అదే సమయంలో బాబా దర్శనానికి వచ్చిన మరికొందరు కూడా ఇదే విషయం చర్చించుకుంటూ బాబా చర్యలు వింతగా చూడసాగారు. బాబా వారు ఓ గొనె సంచి పరుచుకొని తిరగలి ముందు పెట్టుకొని గోధుమలు విసరడం మొదలు పెట్టారు. ఈ వింతను అందరూ విచిత్రంగా చూస్తూ బాబాకు గోధుమ పిండితో ఏమి అవసరం అని తమలో తామే మాట్లాడుకోసాగారు. ఒక నలుగురు మహిళలు మాత్రం ధైర్యం చేసి మసీదు మెట్లు ఎక్కి లోనికి పోయి చొరవగా బాబాను పక్కకు జరిపి వారే పిండి విసరడం మొదలు పెట్టారు. బాబా లీలలు పాడుకుంటూ వారు పిండి విసురుతూ వారిలో వారే బాబాకు ఎలాంటి కుటుంబం లేదు ఆయనేమో భిక్షాటన చేసి జీవిస్తారు కాబట్టి ఈ పిండి మనకే ఇస్తారు అనుకుంటూ పిండి విసరసాగారు. ఇదంతా చూస్తూ బాబా వారు ముందు ఆగ్రహించినా తరువాత చిరునవ్వు నవ్వుతూ జరిగేదంతా గమనించసాగారు.
బాబా ఆగ్రహం!
పిండి విసరడం పూర్తయ్యాక ఆ మహిళలు పిండిని నాలుగు సమాన భాగాలుగా చేసి పంచుకోవడం చూసిన బాబా పట్టరాని ఆగ్రహంతో వారి మీద మండిపడ్డారు. తానేమి వారి నుంచి గోధుమలు తీసుకోలేదని, ఈ గోధుమ పిండి వారు తీసుకోకూడదని బాబా కోపంతో అంటుంటే అందరూ భయపడిపోయారు. తరువాత కొంతసేపటికి శాంతించిన బాబా ఆ పిండిని తీసుకెళ్లి ఊరి పొలిమేరలో చల్లమని చెప్పారు.