Sankashtahara Chaturthi December 2024 :సంకష్ట చతుర్థి ఏర్పడే వారాన్ని అనుసరించి పేరు మారుతుంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం బుధవారాన్ని సౌమ్య వారమని కూడా అంటారు. బుధవారం సంకష్ట చతుర్థి ఏర్పడితే అది చాలా విశేషమని పండితులు చెబుతారు. ఇంతటి విశిష్టమైన సౌమ్య సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల వ్యాపార వృద్ధి, విద్యార్థులకు జ్ఞానం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. అంతేకాకుండా చేసే పనులలో సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయి. డిసెంబర్ 18వ తేదీ బుధవారం సౌమ్య సంకష్ట చతుర్థి సందర్భంగా ఈ వ్రతం ఎలా జరుపుకోవాలి? వ్రత కథ గురించి తెలుసుకుందాం.
సంకటహర చతుర్థి వ్రత విధానం
సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు, అయిదు, తొమ్మిది, పదకొండు లేదా 21 నెలలపాటు ఆచరించాల్సి ఉంటుంది. ఈ వ్రతం చేసే రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పసుపుకుంకుమలతో అలంకరించిన పీట మీద గణేశుని ప్రతిమను ఉంచి ముందుగా షోడశ నామాలతో గణపతిని పూజించాలి.
విఘ్నేశ్వర బియ్యం ఇలా కట్టాలి
ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దానికి పసుపు కుంకుమలు పెట్టి అందులో మూడు గుప్పిళ్ల బియ్యాన్ని పోసి, ఒక తమలపాకులో 5 ఎండు ఖర్జూరాలు, 5 పసుపుకొమ్ములు, 5 వక్కలు ఉంచి 11 రూపాయలు దక్షిణ ఉంచి మనసులోని కోరికను గణపతికి చెప్పుకొని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి.
ముడుపు మూట ఇలా!
ముడుపు మూటను గణపతి ముందు ఉంచి ధూప దీపాలతో వినాయకుని పూజించి కొబ్బరికాయలు, అరటిపండ్లు సమర్పించాలి.
సాయంత్రం పూజ
సంకటహర గణపతి పూజ సాధారణంగా సూర్యాస్తమయం తర్వాతనే చేస్తారు. ఏ రోజైతే చవితి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందో ఆ రోజే సంకష్టహర చవితి జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది. సంకష్ట గణపతి వ్రతం చేసేవారు సాయంత్రం వేళలో వినాయకుని ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేయాలి. వినాయకుడికి గరిక సమర్పించాలి. శక్తి ఉన్నవారు ఆ రోజు ఆలయంలో గణపతి హోమం జరిపించుకుంటే మంచిది. లేని పక్షంలో వినాయకునికి పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవచ్చు.