Manglavaram Pariharalu : ఎంత సంపాదించుకున్నా అప్పులు ఉంటే జీవితం నరకం ప్రాయమవుతుంది. కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించనప్పుడు ఎంత ప్రయత్నించినా రుణ బాధలు తీరవు. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయవలసి వస్తుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మంగళవారం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తే, సమస్యలు తీరడం ఖాయం. అందుకే ఆ పరిహారాలేమిటో ఈ కథనంలో చూద్దాం.
అప్పు లేని వాడు గొప్ప శ్రీమంతుడు
మహాకవి వేమన 'అప్పు లేని వాడు గొప్ప శ్రీమంతుడు' అన్నాడు. అది నిజమే కదా! అప్పులు లేని జీవితం ఆనందదాయకం. అయితే కొంతమంది కావాలని అప్పులు చేసి తిప్పలు పడితే మరి కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేసి ఇలా అప్పుల ఊబిలో కూరుకు పోతుంటారు. అలాంటి వారు మంగళవారం శాస్త్రం చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా అప్పుల తిప్పలు తప్పించుకోవచ్చని తెలుస్తోంది. అవేంటో చూద్దాం.
- మంగళవారానికి అధిపతి కుజుడు. సాధారణంగా రుణబాధలు పెరగడానికి కానీ, తొలగిపోవడానికి కానీ కుజుడే కారణం. అందుకే కుజుని అనుగ్రహం కోసం మంగళవారం కొన్ని పరిహారాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
- మంగళవారం నవగ్రహాలలో కుజునికి దానిమ్మ పండు రసంతో అభిషేకం చేయిస్తే రుణ బాధలు తొలగిపోతాయి.
- మంగళవారం కుజ గ్రహానికి ఎరుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో పూజ జరిపించి ఎర్రని వస్త్రం సమర్పించాలి.
- మంగళవారం ఎర్రని కందులు అంటే ముడి కందులు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వలన కూడా అప్పుల బాధలు తొలగిపోతాయి.
- మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, అర్చనలు జరిపించడం కూడా మంచిది.
- మంగళవారం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి సమక్షంలో మల్లెనూనెతో దీపారాధన చేయడం వలన అప్పుల తిప్పలు తొలగిపోతాయి.
- వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం అప్పు ఇవ్వకూడదు. పొరపాటున కూడా మంగళవారం రోజున ఎవరి దగ్గరా అప్పులు తీసుకోవద్దని, అప్పు ఇవ్వొద్దని అంటారు. ఒకవేళ మంగళవారం అప్పులు తీసుకున్న, ఇచ్చినా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. పైగా డబ్బుకు కొరత ఏర్పడుతుంది.
- తరచుగా ఆర్థిక సమస్యలు, అప్పులతో ఇబ్బంది పడుతుంటే మంగళవారం 21 సార్లు "ఓం హం హనుమతే నమః" అనే మంత్రాన్ని జపిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
- అప్పుల బాధలు తీరడానికి మంగళవారం సీతారాముల సమేతంగా హనుమంతుని పూజించాలి. శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించాలి.
- రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం.
శాస్త్రంలో చెప్పిన విధంగా మంగళవారం ఈ పరిహారాలను పాటించి రుణ విముక్తి పొంది ఐశ్వర్యవంతులం అవుదాం. శుభం భూయాత్
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.