తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శని, బృహస్పతి తిరోగమనం - ఆ రాశుల వారికి బ్రహ్మాండ యోగం - మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - RETROGRADE OF SATURN AND JUPITER

శని, బృహస్పతి అనుగ్రహంతో అక్టోబర్ 31 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం - మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Retrograde Of Saturn
Retrograde Of Saturn (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 5:01 AM IST

Retrograde Of Saturn And Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా ఆ ప్రభావం కొన్ని రాశులపై ఉంటుంది. గ్రహాల గమనం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉండవచ్చు. ఈ క్రమంలో అక్టోబర్ 31 నుంచి శని, బృహస్పతుల గమనంతో ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

దీపావళికి ఏర్పడనున్న దీప యోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల గమనం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తే, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అయితే ఈ గ్రహాల గమనాన్ని నిశితంగా పరిశీలిస్తూ తగిన పరిహారాలు చేసుకోవడం వలన వ్యతిరేక ఫలితాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ క్రమంలో అక్టోబర్ 31 నుంచి బృహస్పతి, శని తిరోగమన సంచారం కారణంగా అత్యంత ప్రత్యేకమైన దీప యోగం ఏర్పడుతుంది. ఈ దీప యోగం కారణంగా దీపావళి నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. దీపావళి పండుగ నాడు బృహస్పతి, శని ఇద్దరు తిరోగమనంలో ఉంటారు.

తిరోగమన సంచారం ఎలా ఏర్పడుతుంది?
ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం, సంవత్సరానికి ఒకసారి బృహస్పతి తమ రాశులను మార్చుకొని వేరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో తిరోగమనం చేస్తున్నాడు. బృహస్పతి వృషభ రాశిలో తిరోగమన సంచారంలో ఉన్నాడు. అత్యంత ముఖ్య గ్రహాల తిరోగమన సంచారం కారణంగా ఏర్పడనున్న దీప యోగం దీపావళి నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తోంది. ఆ రాశులేవో చూద్దాం.

దీప యోగంతో ధనయోగం పొందనున్న రాశులివే!
బృహస్పతి, శని తిరోగమన సంచారం కారణంగా దీపావళి నాడు ఏర్పడనున్న దీపయోగం ముఖ్యంగా ఈ మూడు రాశుల వారి జీవితంలో సంపదలను, శ్రేయస్సును ఇస్తుంది.

వృషభ రాశి
బృహస్పతి, శని గ్రహాల తిరోగమన సంచారం కారణంగా దీపావళి నుంచి వృషభ రాశి వారికి విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఊహించని ధన ప్రవాహం ఉండడంతో సంతోషంగా ఉంటారు.

ధనుస్సు రాశి
గురు, శని గ్రహాలు తిరోగమన సంచారం కారణంగా ఏర్పడిన దీప యోగంతో ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం వరిస్తుంది. చేపట్టిన అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మెరుగైన పురోగతికి అవకాశం ఉంటుంది. మీ పని తీరుకి తగిన ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

కుంభరాశి
శని, బృహస్పతి గ్రహాల తిరోగమన సంచారం కారణంగా ఏర్పడే దీప యోగంతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభ రాశి జాతకులకు ఈ సమయంలో ఖర్చులు తగ్గుతాయి. గత కొంత కాలంగా ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సంపద పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది కుంభ రాశి వారికి అదృష్ట కాలం. జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఫలితాలు మనలో ఆత్మవిశ్వాసం నింపి మరింత చురుగ్గా, ఉత్సాహంతో పనిచేయడానికి అందించే ప్రోత్సాహంగా భావించాలి. కానీ, అన్ని అవే సమకూరుతాయిలే అని బద్దకిస్తే నష్టపోవడం ఖాయం. ఎప్పటికైనా 'కష్టే ఫలి' అన్నదే విజయానికి సూత్రం.

శుభం భూయాత్!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details