Ratha Saptami 2025 : ఏటా మాఘ మాసం శుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటాం. ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవమైన సూర్యుని ఆరాధనకు విశేషంగా భావించే రథసప్తమి పండుగ సందర్భంగా అసలు రథ సప్తమిని ఎందుకు జరుపుకుంటాం? రథసప్తమి విశిష్టత ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు
భూమిపై జీవరాసులు సుభిక్షంగా జీవించి ఉండడానికి కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుని ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తాం. హిందూ సంప్రదాయంలో సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది.
ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం
తెలుగు పంచాంగం ప్రకారం, మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథిని రథసప్తమి పర్వదినంగా జరుపుకుంటాం. మకర సంక్రాంతితో ఉత్తరాయణంలోకి ప్రవేశించే సూర్యుడు ఏడు గుర్రాలతో కూడిన రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మాఘ శుద్ధ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్య కాలంగా పరిగణిస్తారు.
రథసప్తమి ఎప్పుడు?
ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఫిబ్రవరి 4న ఉదయం 7:53 నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 వరకు ఉంది. తిథి అనుసరించి ఫిబ్రవరి 4వ తేదీనే రథ సప్తమిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పూజకు శుభ సమయం.
ఉత్తరాయణ పుణ్యకాలం
సూర్యుడు మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది.
సూర్యుని రథానికి ఏడు గుర్రాలు ఎందుకంటే!
సూర్యుని రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తూ మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. రథసప్తమి అంటే సూర్యజయంతి కాదు. సూర్యుడు రథాన్నెక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది.
రథసప్తమి పూజా విధానం
రథ సప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు ఎంతో సుందరంగా వేస్తారు. అప్పటికే ధాన్యరాశులు ఇళ్లకు చేరి ఉండటం వల్ల ఉదయాన్నే ఇంటిల్లీ పాది స్నానాలు చేసి సూర్యుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.