Pushya Masam 2025 Significance :పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్య మాసమని పేరు వచ్చింది. ఇటు ఆధ్యాత్మికతకు, అటు ఆరోగ్యానికి కూడా పెద్ద పీట వేసే పుష్య మాసం శని ప్రీతికరమైన మాసంగా పేరొందింది.
శని ప్రీతి పుష్య మాసం
శని దేవుని జన్మ నక్షత్రం పుష్యమి. అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్య మాసం శని ప్రీతికర మాసంగా పేరొందింది. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు.
పుష్య మాసం విశిష్టత
పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం. పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా పయనిస్తాడు. ఈ సమయంలో సూర్య కిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనము చేసి, మనస్సులోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాలను హరించి వేస్తుంది. బుద్ధి బలము, ప్రాణ బలము పుష్టిగా లభించే మాసం పుష్యమాసము.
పుష్య మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు
- పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని విశ్వాసం.
- పుష్య మాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తుంది.
- పుష్య మాసంలో వచ్చే ఆదివారాల్లో సూర్యుని జిల్లేడు పూలతో అర్చిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది.
- పుష్య మాసంలో శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర షష్టి సుబ్రహ్మణ్య షష్టి ఎలాగో తమిళులకు పుష్య మాసం శుద్ధ షష్టి అంత విశిష్టమైనది.
- పుష్య శుక్ల అష్టమి రోజు పితృదేవతలను విశేషంగా ఆరాధిస్తారు.
- పుష్య శుక్ల శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం.
పండుగ నెల
పుష్య మాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది.
మకర సంక్రాంతి రోజు ఇలా చేయాలి
మకర సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవు నేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులను, రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు.