Puri Jagannath Rath Yatra 2024 : ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే 'చార్ ధామ్' పుణ్య క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
12 రోజుల ఉత్సవం
జగన్నాథుని రథయాత్ర ఆషాడ శుద్ధ విదియ అంటే జులై 7 న ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతుంది. దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు.
భక్తుల దగ్గరకు భగవంతుడు
సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరి ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన ఈ జగన్నాథ రథ యాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.
ప్రతి ఏటా కొత్త రథం
సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు.
రథ నిర్మాణం అంతా లెక్క ప్రకారమే!
పూరీ రాజు వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తారు. ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు.
రథ నిర్మాణం ఇలా!
తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇక జగన్నాథుడి రథాన్ని 'నందిఘోష' అని, బలభద్రుడి రథాన్ని 'తాళధ్వజం' అని, సుభద్రాదేవి రథం 'పద్మధ్వజం' అని అంటారు.
శాస్త్రోక్తంగా రథయాత్ర
ప్రతి రథానికీ 250 అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలన్ని నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లి పూజరులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే 'మనిమా (జగన్నాథా) ' అని పెద్దగా అరుస్తూ రత్న పీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకొస్తారు.
భక్తుల జై జై ధ్వనులు
ఊరేగింపులో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. అవి అందుకోవడానికి కోసం భక్తులు పోటీ పడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మ ధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు.
కమనీయం జగన్నాథుని దర్శనం
చివరగా భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వచ్చి నందిఘోష రథం మీద ఉంచుతారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను 'పహాండీ' అంటారు.