Onam Festival Significance In Telugu :వ్యాసభగవానుడు రచించిన వామన పురాణం ప్రకారం రాక్షసుల నుంచి భూమండలాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం స్వీకరించి బలి చక్రవర్తి నుంచి మూడు అడుగుల నేలను దానంగా కోరుతాడు. ఒక అడుగు భూమిపై, రెండో అడుగు ఆకాశంపై మోపిన తర్వాత మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని అడుగగా గొప్ప దానశీలి అయిన బలి చక్రవర్తి దానం కోరుతున్నది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అని గ్రహించి మూడో అడుగు తన శిరస్సుపై వేయమని చెబుతాడు.
అయితే అంతకు ముందుగా బలి చక్రవర్తి తాను సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చేలా వరం ఇవ్వమని కోరుతాడు. అందుకు విష్ణుమూర్తి అలాగేనని వరమిచ్చి బలి చక్రవర్తిపై తన మూడవ అడుగు వేసి పాతాళానికి అణిచివేస్తాడు. ఆ విధంగా బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చే సందర్భంగా కేరళ వాసులు ఓనం పండుగను జరుపుకుంటారు.
ఓనం పండుగ ఎప్పుడు?
ఓనం పండుగ ఉత్సవాలు 10 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 6 న మొదలైన ఓనం వేడుకలు 10 రోజుల పాటు సంప్రదాయంగా జరిగి సెప్టెంబర్ 15 న జరిగే తిరుఓనంతో ముగుస్తాయి.
ఓనం విశిష్టత
ఓనం పండగను కేరళ వాసులు తమ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలు తమ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. బంధుమిత్రులతో పండుగ వేడుకలను ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు. కేరళ వాసులు ఓనం పండుగను జీవితంలో ఆనందానికి, శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు.
సౌభ్రాతృత్వానికి ప్రతీక ఓనం!
ఓనం పండుగ సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు చిహ్నం. వివిధ కులాలు, మతాల ప్రజలు కలిసి కుల మత భేదం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని పెంచే ఓనం పండుగను జరుపుకోడానికి దేశవిదేశాలలో స్థిరపడిన కేరళ వాసులు కూడా తమ సొంత రాష్ట్రానికి తిరిగి వస్తారు.