Devi Navaratri Telugu 2024 :దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
మొదటి రోజు..:అమ్మవారు సౌమ్య రూపంలో బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో.. శాక్తేయ రూపంలో శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కలగాలంటే.. బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శైలపుత్రి అనుగ్రహం కలగాలంటే.. కట్టే పొంగలి నైవేద్యంగా సమర్పించాలి.
రెండవరోజు..సౌమ్య రూపంలో అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో.. శాక్తేయ రూపంలో బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. గాయత్రీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఉడకబెట్టిన పెసలు, పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే బ్రహ్మచారిని అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి.
మూడవ రోజు..
అమ్మవారు సౌమ్య రూపంలో అన్నపూర్ణదేవి అలంకారంలో.. శాక్తేయ రూపంలో చంద్రఘంట దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అన్నపూర్ణదేవి అనుగ్రహం కలగాలంటే.. దద్దోజనం, పాయసాన్నం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే చంద్రఘంట దేవి అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించాలి.
నాలుగవ రోజు..
అమ్మవారు సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో.. శాక్తేయ రూపంలో కుష్మాండా దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. లలితా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే.. పులిహోర, పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కుష్మాండా దేవి అనుగ్రహం కలగాలంటే.. అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించాలి.
ఐదవ రోజు..
జగన్మాత సౌమ్య రూపంలో మహా చండీ అలంకారంలో.. శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. మహా చండీ అనుగ్రహం కలగాలంటే.. అమ్మవారికి కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే స్కందమాతకి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి.
ఆరవ రోజు..
అమ్మవారు సౌమ్య రూపంలో మహాలక్ష్మీ అలంకారంలో.. శాక్తేయ రూపంలో కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే.. పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కాత్యాయని అమ్మవారికి కేసరిబాత్ నైవేద్యంగా సమర్పించాలి.
ఏడో రోజు..
అమ్మవారు సౌమ్య రూపంలో సరస్వతీ దేవి అలంకారంలో.. శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. సరస్వతీ దేవి అనుగ్రహం కలగాలంటే.. అటుకులు బెల్లం, పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కాళరాత్రి అమ్మవారికి శాఖాన్నం అంటే.. కూరగాయలతో చేసిన అన్నం నైవేద్యంగా సమర్పించాలి.
ఎనిమిదో రోజు ..
అమ్మవారు సౌమ్య రూపంలో దుర్గాదేవి అలంకారంలో.. శాక్తేయ రూపంలో మహా గౌరీ అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే.. బెల్లం పొంగలి, పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మహా గౌరీ అనుగ్రహం కలగాలంటే.. చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి.
తొమ్మిదో రోజు..
అమ్మవారు సౌమ్య రూపంలో మహిషాసుర మర్దిన అలంకారంలో.. శాక్తేయ రూపంలో సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. మహిషాసుర మర్దిన అనుగ్రహం కలగాలంటే.. వడపప్పు, పానకం, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే.. పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి.
విజయదశమి రోజున..
నవరాత్రులు పూర్తైన తర్వాత దసరా రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో సౌమ్య రూపంలో.. శాక్తేయ రూపంలో భ్రమరాంబికా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే.. కొబ్బరి కాయ ముక్కలు, అరటి ముక్కలు, పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే భ్రమరాంబికా దేవి అనుగ్రహం కలగాలంటే.. పులిహోర నైవేద్యంగా సమర్పించాలి.
ఇలా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు సౌమ్య రూపంలో ఉన్న అమ్మవారి అలంకారాన్ని బట్టి.. శాక్తేయ రూపంలో ఉన్న అమ్మవారి అలంకారాన్ని బట్టి.. ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుని.. ఆ నైవేద్యాలలో మీకు వీలైన నైవేద్యం సమర్పించాలి. తర్వాత కుటుంబ సభ్యులు ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
Note :పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవి కూడా చదవండి :
ఎవరీ బతుకమ్మ? ఎందుకు పండగలా జరుపుకుంటారు? అసలు మ్యాటరేంటి?
'దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ - ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు, బాధలన్నీ తొలగిపోతాయి'