Narmada Nadi Pushkaralu 2024 : 'నీరు' నారాయణ స్వరూపం కాబట్టి శరీరానికి నీటి స్పర్శ అంటే స్నానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరు శుచి అవుతారని శాస్త్రం చెబుతోంది. తీర్థ స్నానం ఉత్తమం. నదీ స్నానం అంతకంటే ఉత్తమం. వీటన్నిటికంటే పరమ పవిత్రమైనది పుష్కర స్నానం. ఎందుకంటే పుష్కర సమయంలో నదీ జలాల్లో దేవతలు, మహర్షులు పుష్కరునితో సహా ప్రవేశిస్తారట! అందుకే హిందూ వైదిక ధర్మం పుష్కర స్నానానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది.
పుష్కర స్నానం విధివిధానాలు
పుష్కర స్నానం చేయడానికి నదిలోకి ప్రవేశించే ముందు నది ఒడ్డున ఉన్న మట్టిని కొంచెం చేతితో తీసుకొని నదిలో కలిపి అనంతరం స్నానం చేయాలని పండితులు చెబుతారు. అలాగే స్నానం చేసేటప్పుడు నదికి నమస్కరించి ముక్కు మూసుకొని మూడు మునకలు పూర్తిగా శిరస్సు మునిగేలా వేయాలి. ఈ స్నానం చాలా పవిత్రమైనది కాబట్టి ఇక్కడ సబ్బులు, షాంపూలు వంటివి వాడరాదు. అలా చేస్తే నదీ జలాలు కలుషితం అవుతాయి.
సూర్య తర్పణం
నదిలో మూడు మునకలు వేసిన తర్వాత మూడు సార్లు దోసిట్లోకి పవిత్ర నదీ జలాలను తీసుకొని సూర్య తర్పణం ఇవ్వాలి. దీనినే అర్ఘ్యం అని కూడా అంటారు.
పితృ తర్పణం
పుష్కర స్నానం పూర్తయిన తర్వాత ఒడ్డుకు వచ్చి తడి వస్త్రాలను పిండుకొని బ్రాహ్మణ ముఖంగా శక్తి కొలది పితృ తర్పణం ఇస్తే పితృదేవతల అనుగ్రహం వలన వంశం నిలబడుతుంది.
పుష్కర సమయంలో ఎలాంటి దానాలు ఇవ్వాలి?
పుష్కర సమయంలో చేసే దానాలకు విశిష్టమైన ప్రాముఖ్యం ఉందని శాస్త్రం చెబుతోంది. అయితే ఏ రోజు ఎలాంటి దానం ఇస్తే ఏ ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- మొదటి రోజు : బంగారం, వెండి, ధాన్యాలు, భూమి
- రెండో రోజు : వస్త్రదానం, ఉప్పు, రత్నాలు
- మూడో రోజు : బెల్లం, పండ్లు
- నాలుగో రోజు : నెయ్యి, నూనె, పాలు, తేనె
- ఐదో రోజు : ధాన్యాలు, ఎద్దులు, నాగలి
- ఆరో రోజు : ఔషధాలు, కర్పూరం, చందనం, కస్తూరి
- ఏడో రోజు : గృహదానం, శయ్య దానం, పీట దానం
- ఎనిమిదో రోజు : చందనం, కందమూలాలు, పూలమాలలు
- తొమ్మిదో రోజు : పిండదానం, కన్యాదానం, దాసి దానం, కంబళి దానం
- పదో రోజు : కూరగాయలు, సాలగ్రామ దానం, పుస్తక దానం
- పదకొండో రోజు : గజం అంటే ఏనుగు దానం
- పన్నెండో రోజు : తిల అంటే నువ్వులు దానం