How to Light the Nakshatra Deepam in Karthika Poornima: కార్తికమాసం హరిహరులకు ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసం నదీ స్నానం, దీపారాధాన, దీప దానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు.. ఈ నెల మొత్తంలో ఒక్కోరోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. పురాణాల ప్రకారం.. కార్తిక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. కాగా ఈ ఏడాది కార్తిక పౌర్ణమి నవంబర్ 15వ తేదీ శుక్రవారం వచ్చింది. అయితే ఈ రోజున గ్రహ దోషాలు, జాతక దోషాలు పోగొట్టుకునేందుకు నక్షత్ర దీపం వెలిగించాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి:
- కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్లాలి.
- ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. పసుపుతో అలకాలి. అనంతరం నక్షత్ర ముగ్గు వేయాలి. నక్షత్ర ముగ్గుకు నాలుగు వైపులా రెండు గీతలు గీయాలి. ఇలా నక్షత్రం ముగ్గు వేస్తే దానికి 27 బిందువులు వస్తాయి. ఈ 27 బిందువులు కూడా 27 నక్షత్రాలను సూచిస్తాయని అంటున్నారు.
- ఈ నక్షత్ర ముగ్గులో 27 బిందువులు ఉన్న చోట పసుపు, కుంకుమ ఉంచి 27 తమలపాకులు ఉంచి వాటి మీద 27 మట్టి ప్రమిదలు ఉంచాలి.
- ఆ మట్టి ప్రమిదలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం నువ్వులు నూనె పోసి 2 లేదా మూడు వత్తులు వేసి ఏకహారతితో దీపాలు వెలిగించాలి.
- మట్టి ప్రమిదల స్థానంలో పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు. అంటే బియ్యప్పిండి, ఆవుపాలు, బెల్లం తురుము కలిపి తయారు చేసినవి. ఒకవేళ పిండి దీపాలు వెలిగిస్తే అందులో ఆవునెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి వెలిగించాలి.
- మట్టి ప్రమిదలు, పిండి దీపాలు లేకపోతే 27 ఉసిరి దీపాలు వెలిగించవచ్చు. అంటే ఉసిరికాయపై కొద్దిగా చెక్కు తీసి దాని మీద ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి దీపం వెలిగించాలి.
అయితే దేవాలయాలకు వెళ్లలేనివారు కూడా పై విధానం ప్రకారం ఇంటి వద్ద ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చని అంటున్నారు మాచిరాజు కిరణ్ కుమార్. అయితే ఇంటి వద్ద 27 ప్రమిదలు వెలిగించడం సాధ్యపడదు అనుకునేవారు మరో పద్ధతిని పాటించవచ్చని చెబుతున్నారు. అది ఏంటంటే..
- ముందుగా ఇంటి ఆవరణలో పీట ఏర్పాటు చేసుకోవాలి. దానికి పసుపు రాసి, కుంకమ బొట్లు పెట్టి నక్షత్ర ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో నవధాన్యాలను కుప్పగా పోయాలి.
- ఆ నవధాన్యాల కుప్ప మీద పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదాన్ని సమాన భాగాలుగా పోయాలి.
- ఆ తర్వాత మూడు రంగులు కలిగిన నూలు వస్త్రాన్ని తీసుకుని పేని ఒకే వత్తిగా చేసుకోవాలి.
- ఆ వత్తిని ప్రమిదలో ఉంచి దీపం వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి పూజా మందిరంలో ఆవునెయ్యి, విప్పనూనె కలిపి దీపం పెట్టాలి. కార్తిక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవ గ్రహాలు, 27 నక్షత్రాల అనుగ్రహం లభించి.. గ్రహ, నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.