తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వేదాలను రక్షించేందుకు మత్స్యావతారం ఎత్తిన శ్రీహరి - ఈ కథ వింటే ఎంత పుణ్యమో తెలుసా?

మత్స్య ద్వాదశి రోజు తప్పకుండా వినాల్సిన కథ ఇదే - ఒక్కసారి వింటే కష్టాలు తొలగి, సకల శుభాలు కలగడం గ్యారెంటీ!

Matsya Avatar Story
Matsya Avatar Story (ETV Bharat & Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Matsya Avatar Story : మార్గశిర మాసం శుద్ధ ద్వాదశి రోజు జరుపుకునే మత్స్య ద్వాదశి వెనుక ఓ పౌరాణిక గాథ ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం, ఒక వ్రతం కానీ, పూజ కానీ చేసుకున్న తరువాత ఆ పూజను ఎందుకు చేసుకుంటున్నామో, దాని వెనుక ఉన్న పురాణం కథ ఏమిటో తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే ఆ వ్రతానికి పరిపూర్ణత చేకూరుతుంది. ఇప్పటికే మత్స్య ద్వాదశి వ్రత విధానం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు వ్రత కథను వివరంగా తెలుసుకుందాం.

దశావతారాల్లో మొదటిది
శ్రీ మహావిష్ణువు దశావతారాలు గురించి అందరికి తెలిసిందే! అయితే ఈ 10 అవతారాల్లోనూ మొదటి అవతారం మత్స్యావతారం. శ్రీ మహావిష్ణువు చేప రూపంలో హయగ్రీవుడనే రాక్షసుని సంహరించి లోక కల్యాణం గావించాడు. పరమ పవిత్రమైన వేదాలను లోకానికి తిరిగి అందించాడు. శ్రీ మహా విష్ణువు మత్స్యావతారాన్ని స్వీకరించిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అసలు శ్రీహరి మత్స్యావతారాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే! యుగే!
ధర్మం గాడి తప్పి అధర్మం పెరిగిపోయిన ప్రతిసారీ ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. అందులో భాగంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీహరి స్వీకరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది.

హయగ్రీవుని కథ
వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించేందుకు మత్సావతారాన్ని స్వీకరించాడు. కశ్యప మహాముని దను దంపతుల కుమారుడు హయగ్రీవుడు. రాక్షస రాజైన హయగ్రీవుడు దానవుల కంటే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని అందుకు కారణం ఏమై ఉంటుందా? అని శోధించి వేదముల వలననే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని గ్రహించాడు.

వేదాలను అపహరించిన హయగ్రీవుడు
రాక్షస జాతిని ఉద్దరించడానికి హయగ్రీవుడు నిశ్చయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందించిన నాలుగు వేదాలను మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే వేదాలను అపహరించి సముద్రం అడుగునకు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు శ్రీహరి మత్స్యావతారము ఎత్తి, సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పజెప్పాడు. ఆ నాలుగు వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే.

శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం స్వీకరించి వేదాలను కాపాడిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం ఆనాటి నుంచి సంప్రదాయంగా మారింది. మత్స్య ద్వాదశి రోజు ఈ మత్స్యావతారం కథను చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం.

ఓం నమో నారాయణాయ!

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details