Masa Shivaratri Pooja Vidhanam In Telugu :వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం మాస శివరాత్రి పూజ చాలా విశిష్టమైనది. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రి రోజు నియమానుసారం శివారాధన చేస్తే దీర్ఘ కాలంగా పీడిస్తున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా ఈసారి మాసశివరాత్రి ఆదివారం కలిసి రావడం వల్ల ఆరోగ్యం కోరుకునే వారు ఈ పూజను తప్పకుండా చేయాలని పండితులు చెబుతున్నారు.
మాస శివరాత్రి అంటే?
అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. అయితే ఇక్కడ చతుర్దశి తిధి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ రోజును మాస శివరాత్రిగా జరుపుకుంటాం.
మాస శివరాత్రి ఎప్పుడు?
సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం మాస శివరాత్రి జరుపుకోవాలి.
మాస శివరాత్రి పూజకు శుభ సమయం?
సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు మాస శివరాత్రి పూజకు శుభ సమయమని పండితులు చెబుతున్నారు.
మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో శివలింగం ఉంటే పంచామృతాలతో శివయ్యను అభిషేకించాలి. తర్వాత శివాష్టకం పఠిస్తూ తుమ్మి పూలతో కానీ, నీలం శంఖు పూలతో కానీ, మారేడు దళాలతో కానీ ఈశ్వరుని పూజించాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. మంగళ హారతులు, కర్పూర నీరాజనాలు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి.