తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శ్రావణ మాసంలో మంగళ గౌరీ పూజ చేస్తున్నారా? మరి వ్రత కథ గురించి తెలుసా? - Mangala Gowri Vratham - MANGALA GOWRI VRATHAM

Mangala Gowri Vratham 2024 : శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు కొత్తగా పెళ్లైన అమ్మాయిలు మంగళ గౌరీ నోము నోచుకుంటారు. ఏ వ్రతమైనా, నోములైనా ఆయా కథలు విని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అవుతుంది. వ్రత ఫలం కూడా పూర్తిగా దక్కుతుంది. సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళ గౌరీ వ్రత కథను ఈ కథనంలో తెలుసుకుందాం.

Mangala Gowri Vratham 2024
Mangala Gowri Vratham 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 5:34 AM IST

Mangala Gowri Vratham 2024 : శ్రావణ మాసంలో నూతన వధువులు విధిగా ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్లైయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణం, బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తోంది.

వ్రత కథ

సంతానం కోసం రాజదంపతులు పూజలు
పూర్వం మహిష్మతీ నగరాన్ని పాలించే జయపాలుడనే రాజుకు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా సంతానం లేదనే విచారం వేదిస్తుండేది. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా వారికి సంతానం కలుగలేదు. కొంతకాలానికి వారి పూజలకు మెచ్చిన పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది.

సన్యాసి రూపంలో పరమశివుడు
పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి 'భవతీ భిక్షాందేహి' అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పళ్లెంలో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు. ఇలా మూడు రోజులు జరిగింది. మహారాణి జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు.

బిక్ష నిరాకరించిన శివుడు
మరుసటి రోజు సన్యాసి రూపంలోని శివుడు రాగానే మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష ఇవ్వబోగా ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, 'సంతానం లేని నీ చేతిభిక్ష నేను స్వీకరించనని' అంటాడు. అప్పుడు మహారాణి 'ఓ మహాత్మా! సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంటుంది.

సంతానం కలిగే ఉపాయాన్ని వివరించిన శివుడు
మహారాణి ప్రార్థనలకు కరుణించిన సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు 'అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు చెప్పు. అతనిని నీలం రంగు వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా నగరానికి తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రిందపడుతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయట పడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలోని అమ్మవారిని నీ భర్త భక్తి, శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది. అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు.

స్వర్ణ దేవాలయంలో జయపాలుని పూజలు
మహారాణి సన్యాసి చెప్పిన విషయంతా భర్తకు చెప్పగా మహారాజు అలాగే చేసి స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాడు.

అమ్మవారి అనుగ్రహం
జయపాలుని భక్తికి మెచ్చి అమ్మవారు కోరినంత ధనాన్నిస్తాను అనగా మహారాజు 'నాకు ధనము వద్దు సంతానము కావాలని' అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు, వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి 'ఆ రాజుని తన పార్శమున ఉన్న గణపతి నాభి యందడుగు వేసి, ఆ పక్కనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు' అని అంతర్ధానమయ్యెను.

గణపతి ఆగ్రహం
అమ్మవారు చెప్పినట్లుగా ఒక పండు కాకుండా జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని గణపతి శపిస్తాడు.

అల్పాయ్ష్కుడైన పుత్రుడు జననం
కొంతకాలానికి జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి శివుడిని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచసాగారు. శివునికి యుక్తవయసు వచ్చింది. కుమారునికి వివాహము చేస్తే ఆయుష్షు పెరుగుతుందేమోనని భావించి శివునికి వివాహం చేద్దాం అని రాణి భర్తతో అన్నది. మహారాజు తన కుమారుడు కాశీ విశ్వేశ్వరున్ని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి ఆ బాలుని తన మేనమామతో కాశీకి పంపించారు.

శివుడుకు సుశీలతో వివాహం
శివుడు అతని మేనమామ కాశీకి వెళ్లే మార్గమధ్యంలో ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను 'ముండ', 'రండ' అంటూ కోపంతో దుర్భాషలాడిన. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబములో ఎవరూ ముండలు, రండలు ఉండరు అని తిరుగు సమాధానం ఇస్తుంది. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు, రండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తుంటుంది. అన్న సుశీల మాట వినేసరికి శివుని మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది. సుశీలను శివునికిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీ దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ, ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల, శివుడు వివాహము జరిగిఫోతుంది.

సుశీలకు మంగళగౌరీదేవి స్వప్న సాక్షాత్కారం
పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు పరిహార మార్గం చెపుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్ది సేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘటం లోకి ప్రవేశించాక వస్త్రము తో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు. దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది.

శివునికి తొలగిన గండం
మంగళ గౌరీ దేవి చెప్పినట్లుగా సుశీల చేస్తుంది. అంతటితో శివునికి గండం తొలగిపోయి పూర్ణాయుష్షు పొందుతాడు. ఇవేమి తెలియని శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. విషయము తెలుసుకొందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావమని చెప్పినది.

ఈ కథను శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా తెలుస్తోంది. శ్రావణ మంగళ గౌరి నోము నోచుకున్న ముత్తైదువులు తప్పకుండా ఈ కథను చదువుకుని, అక్షింతలు శిరస్సున వేసుకుంటేనే వ్రతం సమాప్తం అయినట్లుగా భావించాలి. అప్పుడే వ్రత ఫలం కూడా దక్కుతుంది.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు- నాగపంచమి, రాఖీతో సహా ఈ నెలలో వచ్చే పండుగలివే! - Shravana Masam 2024

సర్వ పాపాలను పోగొట్టే మహిమాన్విత దివ్యక్షేత్రం! కపిల తీర్థం దర్శిస్తే సకల దుఃఖాలు దూరం!! - Kapila Theertham Kapileshar Temple

ABOUT THE AUTHOR

...view details