ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / spiritual

'మహా శివరాత్రి రోజు ఈ పూలతో శివుడిని పూజిస్తే - త్వరలోనే వివాహయోగం'! - MAHASHIVRATRI 2025

మహా శివరాత్రి రోజు శివుడిని ఏ పూలతో పూజించాలో వివరిస్తున్న జ్యోతిష్యులు!

Mahashivratri Pooja at Home 2025
Mahashivratri Pooja at Home 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2025, 2:36 PM IST

Mahashivratri Pooja at Home 2025 :మహా శివరాత్రి రోజున ఆ పరమశివుడిని ఒక్కొక్క రకమైన పుష్పాలతో పూజించడం వల్ల ఒక్కో ఫలితం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం-

శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడిని ఎలాంటి పుష్పాలతో పూజించాలో 'శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత'లో చెప్పారు. 'చంపకం కేతకం హిత్వాత్​ అన్యం సర్వ సమర్పయేత్​' అని అందులో పేర్కొన్నారు. ఇక్కడ చంపకం అంటే సంపంగి, కేతకం అంటే మొగలి. సంపంగి, మొగలి పువ్వులతో తప్ప ఏ పూలతోనైనా ఈశ్వరుడిని ఆరాదించవచ్చని శివమహాపురాణంలో వివరించారు. కాబట్టి, మీరు సంపంగి, మొగలి పువ్వులతో తప్ప ఏ పూలతోనైనా ఆ శివుడిని పూజించండి.

మందార పూలతో :శివరాత్రి రోజు మందార పూలతో శివుడిని పూజిస్తే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి.

గన్నేరు పూలతో :మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈశ్వరుడిని గన్నేరు పూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయట. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇలా పరమేశ్వరుడిని పూజించాలని మాచిరాజు సూచిస్తున్నారు. మనం జీవితంలో కొన్నిసార్లు అన్యాయంగా ధనం సంపాదించాల్సి వస్తుంది. అలా అన్యాయంగా సంపాదించిన డబ్బు దోషం పోవాలన్నా కూడా గన్నేరు పూలతో పరమేశ్వరుడిని పూజించాలి.

పద్మ పుష్పాలు :మనకు తెలియకుండానే ఒక్కొసారి ఇతరులను దూషిస్తుంటాం. అలా తిట్టిన దోషాలన్నీ పోవాలంటే శివరాత్రి రోజు పద్మ పుష్పాలతో శివుడిని పూజించాలి. శివరాత్రి రోజు పద్మ పుష్పాలతో శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

తొడిమ లేని తుమ్మి పుష్పాలు :తొడిమ లేని తుమ్మి పూలంటే శివుడికి చాలా ఇష్టం. తొడిమ లేని తుమ్మి పూలతో శివుడిని పూజిస్తే మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో మన బెస్ట్​ ఫ్రెండ్​కు ద్రోహం చేస్తాం. తొడిమ లేని తుమ్మి పూలతో శివుడిని పూజిస్తే ఈ మిత్ర ద్రోహ దోషం పోతుంది.

సన్నజాజి పూలతో :శివరాత్రి రోజు సన్నజాజి పూలతో శివుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది. వయస్సు పెరిగి వివాహం ఆలస్యమవుతున్నవారు శివరాత్రి రోజు సన్నజాజి పూలతో పూజించాలి.

జాజిపూలతో :మహా శివరాత్రి రోజు జాజిపూలతో శివుడిని పూజిస్తే వాహన సౌఖ్యం కలుగుతుంది. బండి లేదా కారు తొందరగా కొనుక్కోవాలనుకుంటున్నవారు జాజిపూలతో శివుడిని పూజించాలి.

గులాబీ పూలతో :మనస్సులో చాలా కాలంగా ఏదైనా కోరిక ఉంటే అది తీరడానికి శివరాత్రి రోజు గులాబీ పూలతో శివుడిని పూజించాలి.

దీర్ఘాయుర్దాయం కలగాలంటే :దీర్ఘాయుర్దాయం కలగాలంటే, అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే శివరాత్రి రోజు మల్లెపూలతో శివుడిని పూజించాలి. అలాగే వాసన లేని పుష్పాలతో శివుడిని పూజిస్తే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అంతర్గత శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు.

అబ్బాయి జన్మించాలంటే :కొంతమందికి పుత్ర సంతానం కావాలని కోరిక ఉంటుంది. వీరు శివరాత్రి రోజు ఎర్ర కాడలు ఉన్నటువంటి ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించాలి.

కదంబ పుష్పాలు :మహా శివరాత్రి రోజు కదంబ పుష్పాలతో శివుడిని పూజిస్తే భయంకరమైన దృష్టి దోషాలు, తీవ్రమైన శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు.

పచ్చ గోరింట పూలు :శివరాత్రి రోజు పచ్చ గోరింట పూలతో శివుడిని పూజిస్తే జనాకర్షణ, ప్రజాకర్షణ పెరుగుతాయి. ఎదుటి వాళ్లను మీ మాట శక్తితో ఆకర్షింపజేసుకోవచ్చు.

అయితే, మీరు ఏ పుష్పాలు శివుడికి సమర్పిస్తున్న మధ్యలో దవనం కట్టి సమర్పిస్తే చాలా మంచిది. ఇలా శివరాత్రి రోజు ఒక్కో రకమైన పూలతో శివుడిని ఆరాధించడం వల్ల సంపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు తెలిపారు.

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మహాశివరాత్రి రోజు "లింగోద్భవ సమయం" ఎప్పుడంటే! - "ఇలా పూజిస్తే మీపై శివానుగ్రహం"

'శివరాత్రి రోజు ఇలా చేస్తే సొంతింటి కల నెరవేరుతుందట! - జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారంటే'

ABOUT THE AUTHOR

...view details