Reason Behind Lord Shiva having Moon on his Head : ఆ పరమ శివుడిని గరళ కంఠుడు, భోళా శంకరుడు, సాంబుడు అంటూ ఎన్నో పేర్లతో పిలుస్తాం. లోకకల్యాణం కోసం నిత్యం శ్రమించే శంకరుడు, భక్తుల పాలిట కొంగు బంగారం. కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి శివయ్యా అని పిలవగానే మన రక్షణకు ముందుకు కదిలివస్తాడు.
దేవతలు, దేవుళ్లందరూ విభిన్నమైన నగలతో అందంగా అలంకరించుకొని కనిపిస్తారు. కానీ ఆ శివుడు మాత్రం కేవలం మెడలో పాము, తల మీద చంద్రుడు, గంగ, శరీరాన్ని కప్పుకునేందుకు పులి చర్మం, ఒంటినిండా భస్మంతో భక్తులకు దర్శనం ఇస్తాడు. అయితే, చాలా మందికి శివుడి శిరస్సుపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలియదు. భోళా శంకరుడి శిరస్సుపై చంద్రుడు ఉండడం వెనుక ఓ పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది. ఆ కథ మీ కోసం.
ఆ పరమేశ్వరుడు పరమ దయాళువు. లోకకల్యాణం కోసం ఎంతో శ్రమిస్తాడు. ఈ దిశలో ఎన్ని కష్టాలొచ్చినా విశ్వ రక్షణకు ముందుకు వెళ్తుంటాడు. సమస్తజీవులకు ప్రాణసంకటంగా మారిన హాలహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని సంరక్షిస్తున్న నిటలాక్షుడు ఆ పరమేశ్వరుడు.
![Lord Shiva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/23547911_moon.jpg)
అమృతం కోసం మధిస్తుండగా :
గరళ కంఠుడి శిరస్సుపై చంద్రుడు ఉంటాడు. అయితే 'శశి'ని స్వామి ధరించడానికి సంబంధించి పురాణాల్లో సమగ్ర వివరాలు ఉన్నాయి. అమృతం కోసం సముద్రాన్ని దేవదానవులు మందర పర్వతాన్ని వాసుకితో మధిస్తుండగా పర్వతం కొంత సముద్రంలోకి కుంగిపోయింది. దీంతో సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే కూర్మ రూపంలో ప్రత్యక్షమై మందర పర్వతం కింద ఉండి కిందకు పడిపోకుండా భరించాడు. ఈ ప్రక్రియలో ఐరావతము, శ్రీమహాలక్ష్మి, నవనిధులు, అప్సరసలు, ఉచ్ఛైశ్రవము, పుష్పకం, కల్పవృక్షము, పారిజాతం ఉద్భవించాయి.
దేవతలందరూ ప్రార్థించారు :
అమృతం కోసం వడివడిగా సముద్రాన్ని చిలకడంతో హాలాహలం ఆవిర్భవించింది. ఆ సమయంలో భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవదానవులు భరించలేకపోయారు. బ్రహ్మాది దేవతలకు ఈ సమస్యను కట్టడి చేయడం క్లిష్టమైపోయింది. చివరకు బ్రహ్మ ఆ అనంతశయనుడికి మొర పెట్టుకున్నాడు. హరి సూచనతో బడబాగ్నిని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడే శరణ్యమని దేవతలందరూ ప్రార్థించారు. వారి విన్నపాన్ని విన్న పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు.
![Lord Shiva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/23547911_moon2.jpg)
అయితే, హాలహలం వేడికి క్రమంగా శివుని శరీరం నల్లగా మారుతోంది. దీనిని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుని పిలిచి శివుడి జటాజూటములో ఉండమని కోరాడు. చంద్రుని కిరణాలు లేలేతగా చల్లగా ఉంటాయి. ఇవి వేడిని తగ్గిస్తాయి. దీంతో చంద్రుడు శంకరుడి కేశములపై తన శశికిరణాలను ప్రసరించాడు. అయినా వేడి తగ్గకపోవడంతో గంగను పిలిచి ఉమాపతి శిరస్సుపై ఉండి నిత్యం జల ప్రవాహముతో అభిషేకం చేయమనగా గంగ నాటి నుంచి నిత్యాభిషేకముతో ఆ జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తోంది. అందుకనే ఆ పరమేశ్వరుడికి గంగాధరుడు, చంద్రశేఖరుడు అని పేర్లు వచ్చాయి.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటున్నారా? - అవకాశం లేని వాళ్లు ఈ మంత్రం పఠిస్తే సరిపోతుందట
దేవాలయానికి ఎందుకు వెళ్లాలి! - ప్రదక్షిణల పరమార్థం ఏమిటో తెలుసా?