Rama School of Excellence In Vizianagaram District: రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక్కమాటలో చెప్పాలంటే "అమ్మఒడి - చదువుల గుడి" వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మారుమూల గ్రామీణ ప్రాంతంలో అక్షరయజ్ఞం చేస్తోంది ఈ విద్యాలయం. ఆధునికతకు భారతీయతను జోడించి నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేస్తోంది. తక్కువ ఫీజులతో పల్లెటూరి పిల్లల జీవితాల్లో విజ్ఞాన కాంతులను వెదజల్లుతోంది. పిల్లలో క్రమశిక్షణను అలవర్చుతూ వ్యక్తిత్వ వికాసం పెంపొందిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తూ జీవితంలో సమున్నత స్థితికి తీసుకెళ్లే సదుద్దేశంతో పనిచేస్తోంది.
అక్షరయజ్ఞం చేస్తున్న విద్యాలయం: విజయనగరం జిల్లా జామి మండలం విజనిగిరిలో కొలువైన 'రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్' ప్రాంగణమిది. యోగచైతన్య సంస్థ ద్వారా రామ్‌లాల్ ప్రభూజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉన్నతాశయంతో ఏర్పాటుచేసిన విద్యాసంస్థ ఇది. 2010లో ప్రాథమిక పాఠశాలగా మొదలై 2018 నాటికి ఉన్నత పాఠశాలగా ఎదిగింది. ప్రస్తుతం ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు 600 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతోంది. తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్య అందిస్తుండటం రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యేకత. పచ్చటి పొలాలు, ఆహ్లాదకర వాతావరణం మధ్య విద్యాసేవలో తరిస్తోంది.
మూడేళ్లుగా వంద శాతం ఉత్తీర్ణత: కార్పొరేట్‌కు దీటుగా రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో డిజిటల్ విద్యాబోధనను చేస్తున్నారు. అందుకోసం ప్రతి తరగతి గదిలో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన పెద్దతెరలను ఏర్పాటుచేశారు. 40 కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, సకల సౌకర్యాలతో సైన్స్ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి. 34 మంది నిపుణులైన ఉపాధ్యాయులు పిల్లలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ఐఐటీ ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టారు. మూడేళ్లుగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత నమోదవుతోంది. చాలామంది 90 శాతానికి పైగానే మార్కులు సాధిస్తుండటం విశేషం.
ప్రతిభ చూపిన వారికి వంద శాతం రాయితీ: రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం నుంచీ ఇప్పటివరకు తక్కువ ఫీజులే వసూలు చేస్తోంది. తండ్రి చనిపోయిన వారికి, ఆర్థిక స్థితి బాగోలేని విద్యార్థులకు అండగా నిలుస్తోంది. దాతలు 50 శాతం ఫీజు చెల్లిస్తుండగా మిగిలిన 50 శాతం స్కూల్ నిర్వాహకులే భరిస్తున్నారు. మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షల్లో ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన ముగ్గురు లేదా నలుగురికి వంద శాతం రాయితీతో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పిల్లల స్థితిగతులపై మూడు నెలలకోసారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతారు. వెనుకబడిన పిల్లల కోసం సాయంత్రం గంటపాటు అదనపు బోధన ఉంటుంది. వీటితో పాటు నవోదయ, సైనిక్ స్కూలు ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణను సైతం ఇస్తున్నారు.
ప్రతినెలా విద్యార్థులకు వైద్య పరీక్షలు: బాలబాలికల వసతి గృహాల్లో 170 మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రిన్సిపాల్‌తోపాటు ఆరుగురు ఉపాధ్యాయుల కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నాయి. హాస్టల్‌లో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. మెనూ ప్రకారం ఏ రోజుకారోజు వంటకాలను సిద్ధం చేస్తారు. ఉదయం 6 గంటలకే పాలు, రోజుకో రకమైన అల్పాహారం, మధ్యాహ్నం-రాత్రి వేళల్లో వేడివేడిగా పోషకాహారం వడ్డిస్తారు. సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. విద్యార్థుల దుస్తులు ఉతికేందుకు భారీ వాషింగ్ మెషీన్లు, డ్రయర్లు వినియోగిస్తున్నారు. ప్రతినెలా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
రోజూ యోగాభ్యాసం ఈ స్కూల్ ప్రత్యేకత: ఏకాగ్రత, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం రోజూవారీ యోగాభ్యాసం ఈ స్కూల్ ప్రత్యేకత. ఇక్కడ తర్ఫీదు పొందిన పిల్లలు జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభను చూపుతున్నారు. 2014-15లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్ నాయుడు విజేతగా నిలిచాడు. అదే ఏడాది పుణెలో జరిగిన జాతీయ యోగా పోటీల్లో కృష్ణవంశీ మొదటి స్థానంతో సత్తా చాటగా హర్ష, హరీష్, నవతేజ వరుసగా మూడు, ఐదు, 8వ స్థానాలతో ఆకట్టుకున్నారు.
జాతీయ బాలికల విభాగంలో అనుష్క, భార్గవ సింధూదేవి, యామిని ప్రతిభ కనబర్చారు. గతేడాది రాష్ట్రస్థాయిలో దినేశ్ కార్తిక్‌కు నాలుగో స్థానం దక్కగా, మరో మూడు జిల్లా స్థాయి పతకాలు వచ్చాయి. శ్రీ భగవాన్ సత్యసాయి ట్రస్ట్ గతేడాది నిర్వహించిన వేదపఠనం పోటీల్లో జిల్లాస్థాయిలో 9 మంది విద్యార్థులు ప్రతిభ చూపారు. 8వ తరగతి విద్యార్థిని కేవైఎస్ గౌరి అనే విద్యార్థిని భగవద్గీతలో గల 18 అధ్యాయాలను అనర్గళంగా చెప్పి జిల్లాస్థాయి విజేతగా నిలిచింది.
రామా స్కూల్లో విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం, ప్రతిభను వెలికితీసేలా క్రీడలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. ఇప్పటివరకు స్కూల్ ప్రాంగణంలోనే ఆటల్లో శిక్షణ పొందుతుండగా విశాలమైన మైదానం కోసం సమీపంలోనే ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. పదో తరగతి విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంతో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత ఆవశ్యతకను గ్రామస్థులకు తెలియజేస్తున్నారు. 16 నెలల క్రితం విజయనగరం జిల్లా అలమండ వద్ద రెండు రైళ్లు ఢీకొని పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఆ రోజు స్కూలు విద్యార్థులు సహాయచర్యల్లో పాల్గొన్నారు.
అందరూ ఏకరూప దుస్తులు ధరిస్తారు: అందరూ ఒక్కటే అనే భావన కలిగేలా విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బంది సైతం ఏకరూప దుస్తులు ధరిస్తారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా పాఠశాల ప్రవేశ ద్వారం నుంచి అడుగడుగునా ఆసక్తికర సూక్తులు ఆకట్టుకుంటాయి. చుట్టుపక్కల 20 గ్రామాల విద్యార్థుల రాకపోకలకు వీలుగా 6 బస్సులు నడుపుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో రెండు బస్సులు తిప్పేందుకు సిద్ధమయ్యారు. భద్రత పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూలు ప్రాంగణంలో 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
ఇంత మంచి విద్యాసంస్థ రూపుదిద్దుకోవడం వెనుక ఎంతోమంది కృషి ఉంది. విజనిగిరి గ్రామానికి చెందిన యోగాచార్యులు రాపర్తి రామారావు 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. 1993లో స్థానికంగా యోగాశ్రమం నెలకొల్పారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాలనే ఆశయంతో 2000 సంవత్సరంలో ఆరుగురు విద్యార్థులతో గురుకులాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ వచ్చింది.
తల్లిదండ్రులే దాతలుగా మారారు: స్కూల్ మరింత వృద్ధి చెందితే పిల్లల జీవితాలు బాగుంటాయనే భావనతో విద్యార్థుల తల్లిదండ్రులే దాతలుగా మారారు. విరాళాలతో 5.50 ఎకరాల భూమి సేకరించి ట్రస్టుకు అందించారు. విశాఖకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వ్యవస్థాపకులు రాయల వెంకటేశ్వరరావు సీఎస్ఆర్ నిధులతో 2019లో 20 వేల చదరపు అడుగుల్లో మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత 40 వేల చదరపు అడుగుల్లో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. హాస్టల్ భవనాలు, సిబ్బంది క్వార్టర్స్ కూడా కట్టించారు.
ఎన్టీఈసీ సంస్థ అధినేత చిత్తరంజన్ తనవంతుగా స్కూలుకు అవసరమైన ఫర్నిచర్‌ను సమకూర్చారు. యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు సంయుక్తంగా కలిసి 40 కేవీ సోలార్ ప్లాంట్, పవర్ హీటర్లను అందజేశాయి. ఏటా విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ సైతం ఇస్తున్నాయి. ఇంత మంచి విద్యాసంస్థలో చదువుకునే అవకాశం దక్కడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
''మంచి స్కూల్‌ను కడితే ఈ చుట్టు పక్క గ్రామాల్లో ఉన్న రైతులకు, రైతు కూలీలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో దీన్ని స్థాపించాం. కానీ కాలక్రమేణా ఈ విద్యాలయం ఇంత పెద్దగా సంతరించుకుంటుందని మేము అనుకోలేదు. హాస్టల్స్ కూడా పూర్తి స్థాయిలో నిర్మించాం. ప్రధానంగా జామి మండలంలో ఉండే విద్యార్థులకు మేము అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాం. వీరికి ఈ ప్రాథమిక విద్య దశలో సహకారమందిస్తే తరువాత వారు ముందుకు వెళ్లి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది''-రాయల వెంకటేశ్వరరావు, ఛైర్మన్, రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్
''మొదటగా స్కూలు కట్టాలనే ప్రతిపాదన వచ్చిన తరువాత గురువుగారు ఆయన మనోభావం నాకు చెప్పారు. దీనికి సంబంధించి నేను బాధ్యత తీసుకుంటాను. మీరు చేయగలిగింది మీరు చేయండి అని అన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన విద్య లభిస్తుంది''- చిత్తరంజన్,స్కూల్ ఫర్నిచర్ దాత
''చదువుపరంగా, ఆర్థికంగా వెనుకడిన పిల్లలకు ఉన్నతమైన చదువు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ విద్యాలయాన్ని స్థాపించాం. దాంతో పాటు కార్పొరేట్ విద్యాలయాల్లో ఏమేమి సౌకర్యాలైతే ఉంటాయో వాటి కన్నా ఎక్కువగానే ఉండే విధంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. అంతే కాకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్య లేదా తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నాం''-డాక్టర్ రవీంద్రనాథ్, డైరెక్టర్,రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చే లక్ష్యం - 7న మెగా పేరెంట్-టీచర్స్ మీట్
ఇకపై ఇంటర్ విద్యార్థులకు కళాశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజనం : లోకేశ్
రాష్ట్రంలో కార్పొరేటు గురుకులాలు - కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం