తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సంతాన భాగ్యాన్ని ప్రసాదించే 'మహాలయ పక్ష తర్పణం'! ఈ నియమాలు పాటించి చేస్తే మీ పనులకు అడ్డంకులుండవు! - Mahalaya Paksha Tharpanam 2024 - MAHALAYA PAKSHA THARPANAM 2024

Mahalaya Paksha Tharpanam 2024 : గతించిన పితృదేవతలకు సద్గతులు కలిగించడం కోసం ఉద్దేశించిన మహాలయపక్షాలలో 15 రోజుల పాటు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధ విధులను, పేదలకు అన్నదానములు నిర్వహించాలి. శుభకార్యాలు నిషిద్ధమైన మహాలయపక్షాలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనే విషయాలు ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.

Mahalaya Paksha Tharpanam 2024
Mahalaya Paksha Tharpanam 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 7:49 PM IST

Mahalaya Paksha Tharpanam 2024 :కమలాకర భట్ట కృత మూలం ఆధారంగా భాగవతుల సుబ్రహ్మణ్యం రచించిన నిర్ణయ సింధువు, ధర్మసింధూ, నిర్ణయ దీపికా గ్రంథములలో వివరించిన ప్రకారం మహాలయ పక్షములలో పితృ తర్పణాలు, పేదలకు అన్నదానములు, యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృ దేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెంది, తమ వంశాభివృద్ధిని గావిస్తారని శాస్త్ర వచనం. అంతే కాదు శాస్త్రంలో చెప్పిన విధంగా మహాలయ పక్షంలో పితృకార్యాలు నిర్వహిస్తే పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి.

మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి
తెలుగు పంచాంగం ప్రకారం మహాలయ పక్షాలు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి మొదలై అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్యతో ముగుస్తాయి.

మహాలయ పక్షాలు గురించి పౌరాణిక గాథ

పట్టిందల్లా బంగారం
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫల వృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారి పోయింది. స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది.

కర్ణుడి తప్పిదం తెలిపిన అశరీరవాణి
దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి? తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా, అశరీరవాణి ''కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు, అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది'' అని పలికింది.

తండ్రి సూర్యుని ప్రార్థించిన కర్ణుడు
కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. ఇంద్రుడు, కర్ణుడిని వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

భూలోకాని తిరిగి వచ్చిన కర్ణుడు
ఇంద్రుని సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికి అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి మహాలయ అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి ఆకలి తీరింది. కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి, భూలోకంలో గడిపి తిరిగి స్వర్గాని కెళ్లిన ఈ పక్షం, అనగా 15 రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజు మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

పితృదోషాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృ దోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకు ముఖ్యమైన పనులన్నింటిలోనూ పదే పదే ఆటంకాలు, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం, కుటుంబంలో మహిళకు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వల్ల తీవ్ర సమస్యలు వంటివి సంభవిస్తాయి.

మహాలయ పక్షంలో పాటించాల్సిన నియమాలు

  • మహాలయ పక్షంలో 15 రోజుల పాటు పితృదేవతలను స్మరించుకోవాలి.
  • ప్రతిరోజూ విధిగా ఒంటిపూట భోజనము చేస్తూ, భూశయనం చేయాలి.
  • మద్యమాంసాలు ముట్టరాదు. బ్రహ్మచర్యం పాటించాలి.
  • పితృదేవతలకు ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జల తర్పణాలు వదలాలి. 15 రోజులు వీలు కాని వారు కనీసం మహాలయ అమావాస్య రోజునైనా తర్పణం వదలాలి.
  • జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. కాకులకు ఆహారం ఇవ్వాలి.
  • 15 రోజులపాటు అన్నదానం చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది.
  • పేదలకు వస్త్రదానం చేయాలి.
  • బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి.
  • చివరగా మహాలయ పక్షం 15 రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి.
  • స్కాంద పురాణం ప్రకారం మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధ, దాన, పుణ్యకర్మల వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వంశాభివృద్ధి అవుతుంది. పితృ దోషాల వలన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details