Hanuman Special Temple :రామనామ స్మరణ చేసిన చోట హనుమంతుడు తప్పకుండా ఉంటాడని అంటారు. హనుమంతుని అనుగ్రహాన్ని సులభంగా పొందే మార్గం రామనామ స్మరణం ఒక్కటేనని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఒక్కసారి శ్రీరామా అని భక్తిశ్రద్ధలతో అంటే చాలు హనుమ మన కష్టాలన్నీ పోగొడతాడంట! అందుకే హనుమకు సంకట మోచనుడని పేరు వచ్చింది.
హనుమ ఆలయాలలోకెల్లా ప్రత్యేకం ఈ ఆలయం
మన దేశంలో హనుమంతునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం చాలా ప్రత్యేకం. ఈ ఆలయంలో హనుమంతుడు భక్తుల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాడని విశ్వాసం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
జంసన్‌వాలి హనుమ ఆలయం
Jam Sawali Hanuman Mandir History : మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో ఉన్న జంసన్‌వాలి ఆలయానికి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 22 ఎకరాలలో వెలసిన ఈ ఆలయంలో హనుమంతుడు భక్తులచేత పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం విశ్రాంతస్థితిలో ఉన్నట్లుగా ఉంటుంది. దాదాపు 18 అడుగుల పొడవు ఉండే హనుమ విగ్రహం తలపై వెండి కిరీటంతో నిద్రిస్తున్నట్లుగా ఉండడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది.
ఆలయ స్థలపురాణం
త్రేతాయుగంలో జరిగిన శ్రీరామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సంజీవని కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయాల నుంచి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడని, అందుకే ఇక్కడి హనుమ విశ్రాంత స్థితిలో ఉన్నాడని భక్తుల విశ్వాసం.
హనుమ నాభి నుంచి నీరు
ఇక్కడి హనుమంతుని విగ్రహం నాభి నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఆ నీరు ఎక్కడ నుంచి వస్తోందో, ఎక్కడకు వెళ్తోందో ఎవరికీ తెలియదు.
నీరే ప్రసాదం
హనుమంతుని నాభి నుంచి వచ్చే నీటినే ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. ఆ నీటిని భక్తులు అమృతంలా, రోగాల పాలిట సంజీవనిలా భావిస్తారు.