Lord Shri Krishna Death Story: అధర్మం పెచ్చుమీరినప్పుడు, ధర్మం ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దైవుడు ఏదో ఒక అవతారంలో వచ్చి ధర్మ సంస్థాపన చెయ్యడం మన పురాణాల్లో ఉంది. మనుషులు ధర్మాన్ని ఎలా ఆచరించాలి. ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదురించాలి. ఇలా లోకం తీరు గురించి చెప్పడానికి శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో మనకు బోధ చేశాడు. మహాభారతంలో ప్రతి ఒక్క అంశం మన జీవితాలను ప్రభావితం చేసేదే.
కర్తవ్య బోధతో పాటు కర్మ ఫలితం గురించి శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా తన జీవితం ద్వారా చాటిచెప్పాడు. అయితే ధర్మాన్ని గెలిపించిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాలని ముందుగా నిర్ణయించుకుంటాడని, తర్వాత నిర్యాణం చెందుతాడని మహాభారతంలోని మౌసల పర్వంలో ఉంది. అలాగే భాగవతంలోని ప్రథమ పర్వంలోని కృష్ణ నిర్యాణ ఘట్టం శ్రీకృష్ణుడి నిర్యాణంతో పాటు ద్వారక మునిగిన తీరును వివరిస్తుంది.
ద్వారక ఎలా మునిగిందంటే?
పురాణాల ప్రకారం కొంతమంది మహర్షులు ద్వారకలోని శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి వస్తారు. అయితే అలా వచ్చిన మహర్షులను ద్వారకలోని యాదవ బాలురు ఆటపట్టించాలని అనుకుంటారు. అందుకే ఒక పురుషుడికి స్త్రీ వేషం వేసి, గర్భం వచ్చినట్లు చూపించి, మహర్షులను ఈ గర్భవతికి ఆడబిడ్డ పుడుతుందా, మగబిడ్డ పుడుతుందా అని అడుగుతారు. దివ్యదృష్టి కలిగిన మహర్షులు దానిని గమనించి యాదవ బాలలపై కోపగించుకుంటారు.
బాలురు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహర్షులు యాదవులు పరస్పర కలహాలతో కొట్టుకొని నాశనం అవుతారని, ద్వారాక సముద్ర గర్భంలో కలుస్తుందని శాపం ఇస్తారు. మహర్షుల శాపం ప్రకారమే యాదవ వంశం కలహాలతో నాశనం అవడం, దానితో పాటు ద్వారక సముద్రంలో మునిగిపోవడం జరుగుతాయి. అయితే అదే సందర్భంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని అడవిలో చాలిస్తాడు.