Kushmanda Deepam Telugu :భగవంతుని పూజలో దీపారాధనకు విశిష్ట స్థానముంది. అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపం, కార్తీక మాసంలో పెట్టే ఉసిరిక దీపం ఇవన్నీ ఈ కోవకు చెందినవే! అలాగే మరో ప్రత్యేక దీపారాధన పద్ధతి అయిన కూష్మాండ దీపం గురించి తెలుసుకుందాం.
కూష్మాండం అంటే?
కూష్మాండం అంటే గుమ్మడికాయ. హిందూ సంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది.
కూష్మాండ దీపం విశిష్టత
ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం, పిల్లలు మాట వినకపోవడం, సంతానం కలగక పోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్న వారు కాల భైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు. క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కావలసిందల్లా కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే!
కూష్మాండ దీపం ఎలా పెడతారు
ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే! ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి, లోపల ఏమి లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి. తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి.
పంచోపచార పూజ
దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాల భైరవ అష్టకం 11 సార్లు చదవాలి.